కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నూతన చట్టాలను బిజెపేతర పాలిత రాష్ట్రాలు, అలాగే మేధావుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గతంలో బిజెపి తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్, ఆర్టికిల్ 370 రద్దు, ఎన్ఆర్సి, పౌరసత్వ బిల్లులను కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఏనాడు కూడా తమ ప్రభుత్వం వచ్చిన తరువాత నూతనంగా తీసుకొచ్చిన ఈ చట్టాలను మార్చి, ప్రజలకు ఆమోదయోగ్యమైన నూతన చట్టాలను తీసుకొస్తామని ఏనాడు కూడా పేర్కొనలేదు. వ్యవసాయ చట్టం విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రణాళికలను రచిస్తుంది. ఈ చట్టం అములుకు నిలిపేందుకు వీలుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఆ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చట్టాన్ని అమలు కాకుండా చూస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పిలుపిచ్చిన విషయం కూడా తెలిసిందే. ఇందులో భాగంగానే ఓ ముసాయిదా బిల్లును పార్టీ రూపొందించి వ్యవసాయ చట్టాల అమలును నిలిపేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నది.
బిల్లు ఆమోదించేలా..
కేంద్రం తీసుకొచ్చిన నూతన మూడు వ్యవసాయ బిల్లులోని కొన్ని నిబంధనలను తీసుకొని ఆ చట్టం రాష్ట్రాలలో అమలు కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ దిశగా పరిశీలిస్తున్నాయి. వ్యవసాయ బిల్లును ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై రాష్ట్రాలకే అధికారం ఉండేలా బిల్లులో నిబంధన ఉంది. మద్దతు ధర కంటే తక్కువగా రైతుల నుంచి వ్యాపారులు పంట కొనుగోలు చేయకుండా అందులో నిబంధన సైతం ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి మార్పులు చేస్తూ నూతన బిల్లును ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది.
మమతా, కేసిఆర్ కూడానా..
వ్యవసాయ చట్టం అమలు చేసే విషయంలో కాంగ్రెస్‌తో పాటు మమతా బెనర్జీ, కెసిఆర్ కూడా అదే బాటలో నడుస్తారా? లేదో? చూడాల్సి ఉంది. కేంద్రం తీసుకొస్తున్న చట్టాలను ముందు నుంచి కేసిఆర్, మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బిజెపి విధానాలను ఎండగడుతున్న రాష్ట్రాలల్లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయి. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై కెసిఆర్ కోపంగానే ఉన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా తెరాస రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టింది. ట్రాక్టర్లతో ర్యాలీలు చేపట్టి ఆ చట్టానికి తాము వ్యతిరేకమనే సంకేతాన్ని కేంద్రానికి ఇచ్చింది. అలాగే మమతాబెనర్జీ కూడా.
ఈనేపథ్యంలో వ్యవసాయ చట్టం తమ రాష్ట్రాల్లో అమలు కాకుండా కాంగ్రెస్ తరహాలో ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎత్తుగడలు వేసే అవకాశం లేకపోలేదు. అలాగే వైసిపి పార్టీ మాత్రం వ్యవసాయ బిల్లు విషయంలో తాము అనుకూలమేనన్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చేసింది. బిజెపి స్నేహ హస్తాన్ని కోరుకునేందుకే ఈ విధంగా నడుచుకుంటుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈక్రమంలో రేపు జరగబోయే అపెక్స్ సమావేశం, ఇతర కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు జగన్ ఢిల్లీకి బయలు దేరుతున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బిజెపి ప్రభుత్వంలో చేరేఅవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ బాటలో నడిచే వారు ఎవరో.. నడవని వారు ఎవరో వేచి చూడాలి మరి.