సినిమా థియేటర్లలో బొమ్మ పడదు.. నిర్మాతల దిమ్మతిరగడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ఏడు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయి. సినిమాల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావడంతో ఇక ఈ నెల 15 నుంచి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేయవచ్చని అందరూ అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమాల విడుదల దాదాపు లేనట్లే. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధంగా లేరు. ఈ విషయంలో నిర్మాతల పరంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. థియేటర్లు ఓపెన్ చెయ్యాలంటూ నిర్మాతలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది.
అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని రంగాలకూ సడలింపులు ఇస్తున్న ప్రభుత్వం ఈసారి థియేటర్లకు ఆ అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓపెన్ చేసుకోవచ్చని కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక థియేటర్లు ఓపెన్ అయిపోతున్నాయని కొంతమంది సినిమా ప్రేమికులు సంతోషపడ్డారు. చిన్న సినిమాల నిర్మాతలు తమ తమ సినిమాలను రిలీజ్ చేసుకునేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఊహించని విధంగా యాజమాన్యం మాత్రం థియేటర్లు ఓపెన్ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇన్నళ్లూ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురుచూసిన ఎగ్జిబిటర్లు ఇలా రివర్స్ అవ్వడానికి ఓ ప్రధానమైన కారణమే ఉందని తెలుస్తోంది.
థియేటర్ల నిర్వహణ పెనుభారం
సినిమా థియేటర్ల నిర్వహణ అనేది ఎగ్జిబిటర్లకు పెనుభారంగా మారింది. నెలకు దాదాపు రెండు లక్షలు ఖర్చవుతోంది. దీనికి తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు ఓపెన్ చేసి ఎప్పటిలాగే రన్ చేయాలంటే యాజమాన్యానికి అదనంగా భారం ఖాయం. థియేటర్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయించాలి. దాని కోసం ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. వీటన్నింటికంటే ముఖ్యమైంది.. థియేటర్‌లో పనిచేసే కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలి. ఇప్పటివరకు లాక్‌డౌన్ కారణంగా సగం జీతం చెల్లిస్తున్నారు. ఇవన్నీ భరించి థియేటర్ ఓపెన్ చెయ్యాలంటే సరైన సినిమా ఒక్కటీ లేదు. రిలీజ్‌కి సిద్ధంగా ఓ యాభై సినిమాలు ఉన్నప్పటికీ వాటిని రిలీజ్ చేస్తే ఎన్నిరోజులు రన్ అవుతాయో తెలీదు.
యాభై సినిమాలూ ఓ రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత థియేటర్లు మళ్లీ ఖాళీ అవుతాయి. ఒకసారి ఓపెన్ చేసిన థియేటర్లను మళ్లీ మూసెయ్యాలంటే థియేటర్ యాజమాన్యానికీ కష్టమే. రెండు నెలల తర్వాత కొత్త సంవత్సరంలో సంక్రాంతికి కొత్త సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌కి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అలాంటి సినిమాలు షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. ఇప్పడిప్పుడే కొంతమంది హీరోలు షూటింగులకు హాజరవుతున్నారు. పెద్ద హీరోల సినిమాలు, ఒక రేంజ్ హీరో సినిమాలు అయితే తప్ప థియేటర్లు ఓపెన్ చేసి ప్రయోజనం లేదు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్లు ఓపెన్ చెయ్యాలా వద్దా అనే విషయంపై ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, బయ్యర్లు ఇటీవల ఓ సమావేశాన్ని నిర్వహించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో థియేటర్లు ఓపెన్ చెయ్యాలా, ఓపెన్ చేస్తే ఇదివరకటిలా కంటిన్యూగా రన్ చేయడానికి వీలవుతుందా? ఇప్పుడు రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలతో థియేటర్లు ఎన్ని రోజులు రన్ చేయగలరు? వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. అయితే 80 శాతానికి పైగా ఎగ్జిబిటర్లు థియేటర్లు ఓపెన్ చేసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. వాక్సీన్ వచ్చిన తర్వాత లేదా దీపావళి నుంచి థియేటర్లను ఓపెన్ చేస్తే మంచిదని, అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని వారంతా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దీన్నిబట్టి చూస్తే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదని అర్థమవుతోంది.
కరెంటు బిల్లుల మాటేమిటి?
థియేటర్లు మూతపడిన ఈ ఏడు నెలల కాలంలో ఎగ్జిబిటర్లు కరెంటు బిల్లులు చెల్లించలేదట. బకాయిలు చెల్లించకపోవడంతో వీటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వం ఈ విషయంలో సడలింపులు ఇవ్వాలని కూడా ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. మరో విషయం ఏమిటంటే 50 శాతం సీట్లు ఉన్నా 100 శాతం ఆస్తి పన్ను చెల్లించే పరిస్థితి ఉంది. ఈ ఆస్తిపన్నును కూడా మాఫీ చేయాలని కోరుతున్నారు. అలాగే జీఎస్టీ కూడా తగ్గించాలంటున్నారు. వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలని కూడా నిర్మాతలు కోరుతున్నారు. దీని మీద ఈ రెండు రోజులు సమావేశాలు జరుగనున్నాయి. అందరూ చర్చించుకుని ఓ నిర్ణయానికి రానున్నారు. దీపావళికి తప్ప ఈలోపు థియేటర్లు ప్రారంభమయ్యే వాతావరణం మాత్రం కనిపించడం లేదు.











