తెలుగుదేశం పార్టీలో రెండు తెలుగురాష్ట్రాల, జాతీయ కమిటీల కార్యవర్గాలను ప్రకటించారు గానీ.. ఇప్పటిదాకా ఏపీ తెలుగుయువత అధ్యక్షుడు ఎవరనే సంగతి మాత్రం చంద్రబాబు ప్రకటించలేదు. ఆ సంగతి తేల్చడం ఆయన వల్ల కావడం లేదు. ఈ విషయంలో ఆశావహులు అనేక మంది ఉన్నప్పుడు.. అధినేత ఏ సంగతీ తేల్చకుండా మీన మేషాలు లెక్కించడం చాలా సాధారణమైన విషయం. కానీ.. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితి ఏంటంటే.. తెలుగుయువత సారథ్యాన్ని అందింపుచ్చుకోవడానికి ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు గట్టిగా పట్టుపడుతున్నారు. ఇది ఎంతవరకూ వెళ్లిందంటే.. ‘మాకు పదవి ఇవ్వనప్పుడు మేం పార్టీకోసం ఎందుకు కష్టపడి పనిచేయాలి?’ అనే డిమాండ్ తో వారు అలక వహించి మిన్నకుండిపోతున్నారు.
ఈ పరిస్థితి ఏపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి.. తెలుగుయువత ప్రస్థానాన్ని సందిగ్ధంలో పడేస్తోంది. తెలుగుయువత సారథ్యం పరిటాల శ్రీరామ్ చేతుల్లో పెడతారనే తొలినుంచి ఊహాగానాలు వినిపిస్తుండేవి. అయితే.. ఇదే పదవి కోసం జేసీ పవన్ కూడా పట్టుపట్టారు.
Must Read ;- రగిలిన తా‘ఢి’పత్రి.. జేసీ ఇలాకాలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాదాగిరి
జెసి పవన్ పట్టు ఏంటి?
ఏ రకంగా చూసినా సరే.. అనంతపురం జిల్లా రాజకీయాలకు సంబంధించినంత వరకు.. రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది జెసి కుటుంబాన్నే. వారి కుటుంబం మొత్తం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జెసి బ్రదర్స్ కు చెందిన బస్సుల విషయంలోనే అరెస్టులు కూడా జరిగాయి. బెయిల్ మీద బయటకు రాగానే.. మళ్లీ.. కరోనా నిబంధనల ఉల్లంఘన అంటూ మళ్లీ అరెస్టులు జరిగాయి. కరోనా సోకి ఆస్పత్రి పాలవగా, తిరిగి బయటకు రాగానే మళ్లీ కరోనా నిబంధనల ఉల్లంఘన అంటూ అరెస్టులు జరిగాయి. ఇలా అనేక రకాలుగా.. జెసి కుటుంబాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతున్నదా..? అని ప్రజలు సందేహించేలాగా పరిణామాలు ఉంటున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం తమ కుటుంబాన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నది గనుక.. తమ కుటుంబంలో పదవి ఉంటే.. కనీసం జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించగలం అని.. పార్టీ అయినా తమకు దన్నుగా ఉన్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని జెసి పవన్ పట్టుపడుతున్నారట. ఒక రకంగా ఆలోచించినప్పుడు ఆ లాజిక్ కూడా కరక్టే అనిపిస్తుంది. అయితే ముందునుంచి పరిటాల శ్రీరామ్ కు పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. యువత పదవైనా తమకు ఇచ్చి తీరాల్సిందేనని పవన్ పట్టుపట్టడం వల్ల చంద్రబాబు నాయుడు ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు.
సైలెంట్ గా జెసి పవన్
తమ డిమాండ్ మేరకు తమ కుటుంబానికి పదవి ఇవ్వనప్పుడు ఇక పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఎందుకు ఉండాలని జెసి పవన్ సైలెన్స్ పాటిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఇప్పుడు పార్టీ గేరప్ కావాల్సిన సందర్భం. నేడో రేపో.. ఫిబ్రవరిలోగా స్థానిక ఎన్నికలు జరిగే వాతావరణమే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలు ఆలోచన గనుక కార్యరూపం దాలిస్తే.. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ ఎన్నికలన్నింటినీ సమర్థంగా ఎదుర్కోవాలంటే.. ఇప్పటినుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. అయితే… ఇలాంటి కీలక సమయంలో నేతలు అలిగి సైలెంట్ గా ఉంటున్నారు.
శ్రీరాం కూడా మౌనమే..
తనకు దక్కుతుందని అనుకున్న పదవిని, తమ కుటుంబానికి ఆగర్భ శత్రువులైన జెసి కుటుంబం డిమాండ్ చేయడం ఒక ఎత్తయితే.. వారి ఒత్తిడికి తలొగ్గి తనకు కూడా పదవి ఇవ్వకుండా ఆపేయడం పరిటాల శ్రీరాం కు కూడా అలక తెప్పించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన కూడా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకుండా సైలెంట్ గా ఉన్నారు.
జిల్లాలోని ఇద్దరు కీలక యువ నాయకులు పదవులకోసం పార్టీ మీద అలకతో.. మౌనం వహిస్తుండడం … పార్టీ ప్రస్థానాన్ని ఎటు తీసుకువెళుతుందో వేచిచూడాలి.
Also Read ;- అనంత బ్యాంకు ఉద్యోగిని హత్య కేసులో విస్తుపోయే నిజాలు