ఏపీలో అధికార పక్ష హోదా నుంచి కనీసం విపక్ష హోదా దక్కించుకోలేక చతికిలబడ్డ వైసీపీలో నిత్యం వింత పోకడలు, విచిత్ర ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. తమకు దగ్గర అనుకున్న నేతకు పార్టీలోని అందరు నేతలు అండాదండాగా నిలుస్తూనే… తమకు అంతగా అక్కరలేని నేతకు మాత్రం కనీస మద్దతు ప్రకటించేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధంగా ఉండరు. ఈ తరహా ఘటనలు ఆ పార్టీలో కోకొల్లలుగా జరగగా… తాజాగా మరో ముఖ్య ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ఘటనలను చూస్తే… వైసీపీలో కొనసాగుతున్న అసలు సిసలు సంస్కృతి ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళనలో భాగంగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం ఇటీవలే పలు నిర్ణయాలు ప్రకటించింది.
పార్టీ ఆదేాశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. తిరుపతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వైసీపీలోని కీలక నేతల నిజంగానే క్యూ కట్టారు. రాయలసీమ జిల్లాల పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి హాజరు కాగా… పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితర నేతలంతా హాజరయ్యారు. పార్టీలో జగన్ తర్వాత స్థానంలో ఉంటారని భావిస్తున్న ముగ్గురు రెడ్లు… సజ్జల,సాయి, వైవీ సుబ్బారెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీమ ఇంచార్జీ హోదాలో వైవీ హాజరును ఎవరూ తప్పుబట్టలేరు. అయితే ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ గా ఉన్న సాయిరెడ్డి, కేంద్ర కార్యాలయం వ్యవహారాలు చూసుకునే సజ్జల హాజరుపై పార్టీ నేతలు ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
తిరుపతిలో భూమన మాదిరిగానే… ఏపీలోనే రాజకీయంగా అత్యంత ప్రభావితం చేయగలిగిన జిల్లాగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి చెందిన యువ నేత దేవినేని అవినాశ్ కూడా ఆదివారమే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ కోస్తాంధ్ర జిల్లాల కన్వీనర్ హోదాలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి హాజరు అయ్యారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇటీవలే జనసేనను వదిలి వైసీపీలో చేరిన పోతిన మహేశ్, మరో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ లతో పాటు జగన్ కు అత్యంత దగ్గరి నేతగా పేరున్న గౌతం రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరిలో నాని, పోతిన తప్పించి పెద్దగా మాట్లాడే నేతలే లేరని చెప్పాలి. ఏదో రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నాను కాబట్టే తాను వచ్చినట్లుగా అయోధ్య రామిరెడ్డి తనకేమీ పట్టనట్టే వ్యవహరించారు. వెరసి… నాని, పోతినలే ఈ సమావేశంలో అంతా తామై వ్యవహరించారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గానీ, మాజీ మంత్రి కొడాలి నాని గానీ సమావేశం దరిదాపుల్లోకే రాలేదు.
ఈ రెండు సమావేశాలను చూసిన ఆ పార్టీ శ్రేణులే… అదేంటీ… భూమనకు పార్టీ నేతలు జాతర కట్టారు… అవినాశ్ కార్యక్రమానికేమో ముఖం చాటేశారు అంటూ చర్చించుకున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భూమన అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా వారిద్దరి మధ్య కొంత మేర బంధుత్వం కూడా ఉందని అంటారు. ఇక భూమన కూడా జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే. భూమన సభకు హాజరైన ముగ్గురు కీలక నేతలు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇక చోటామోటా నేతలను కూడా పరిగణనలోకి తీసుకుంటే… భూమన సభలో రెడ్డి సామాజిక వర్గం ఏకంగా బల ప్రదర్శనకే దిగిందన్న వాదనలు వినిపించాయి. అదే అవినాశ్ అంశానికి వస్తే… విజయవాడ లాంటి కీలక నగరంలో కీలక నేతగా ఎదిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అవినాశ్…తనకు టీడీపీలో మంచి పరిచయాలు ఉన్నా… ఆ పార్టీని వీడి వైసీపీలోకి వచ్చారు. అంతేకాకుండా నగరంలో వైసీపీకి ఏ చిన్న అవసరం పడ్డా అన్నీ తానై అవినాశ్ వ్యవహరిస్తున్నారు. అలాంటి నేతను గాలికొదిలేసిన వైసీపీ…భూమనకు పట్టం కట్టేందుకు తరలివెళ్లిందంటూ సెటైర్లు పడిపోతున్నాయి.