గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి.. బోండా ఉమ కారు ధ్వంసం..!
గుడివాడలో సంక్రాంతి పండుగ నాడు మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ హాల్లో కేసినో నిర్వహించారు. కేసినో వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నిజనిర్థారణ కమిటీ వేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రులు ఆలపాటి, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, నేతలు బోండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్యలను సభ్యులుగా నియమించారు. ఉదయం నిజనిర్థారణ కమిటి గుడివాడకు చేరుకోగానే.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ కార్యాలయంపై, నేతలపై దాడి చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసం చేశారు. పెద్దఎత్తున వైసీపీ నాయకులు నడిరోడ్డుపై దాడికి పాల్పడుతుంటే.. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. పైగా కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లేందుకు అనుమతి లేదంటూ టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులను అడ్డుకున్నారు. అంతేకాక అరెస్ట్ చేసి, బలవంతంగా గుడివాడ పీఎస్ తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
చేతులెత్తేసిన లా అండ్ ఆర్డర్..!
గుడివాడలోని కన్వేన్షన్ హాలును పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ నిజ నిర్థారణ సభ్యులను రిసీవ్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలు.. ర్యాలీగా బయలుదేరారు. టీడీపీ నేతల ర్యాలీకి ప్రతిగా వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ రెండు ర్యాలీలు ఒకే ప్రాంతంలో ఎదురుపడితే.. ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయని భావించిన పోలీసుల జాగ్రత్తలు తీసుకున్నాయి. అయినా పోలీసులను తోసుకుంటూ వైసీపీ శ్రేణులు నాగవరసప్పాడు సెంటర్ వచ్చారు. ఈ క్రమంలో నెహ్రూ చౌక్ సెంటర్ సమీపంలో టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తరువాత వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. బోండా ఉమ కారు అద్దాలను పగలగొట్టారు. గుడివాడ టీడీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఇంత చేస్తున్న వైసీపీ శ్రేణులను అడ్డుకోవడంమాని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం నిలువరించే ప్రయత్నం కూడా పోలీసులు చేయాలేకపోయారని టీడీపీ నేతలు మండిపడ్డారు.











