ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.ఈ తరుణంలో వైసీపీ నేతలు మాట్లాడిన వీడియో సంచలనంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇలా మాట్లాడినట్లు అర్థం అవుతోంది.వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు వైసీపీ నేత ఆకుల సత్యానారాయణదిగా చెబుతున్న ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని స్వయంగా ఆ నేతలు మాట్లాడుకుంటున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే..
‘ఈ అంబులెన్స్ కేవలం అంతిమ యాత్రకు మాత్రమే వాడతారు.పేషెంట్ల తరలింపునకు వేరే అంబులెన్స్‌లు ఉన్నాయి. అవి కూడా దొరకడం లేదు. ప్రభుత్వం చేతులెత్తేసింది.ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం ఆ నిర్వహణ కూడా చేయలేదు.వారం పోయాక చెబుతాను. ఎమ్మెల్యే కూడా అదే చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయలేదు’. అని వ్యాఖ్యానాలు ఉన్నాయి.ఇదే వీడియోలో మరో వ్యక్తి మాట్లాడుతూ అంతిమ యాత్ర కోసం సాధారణంగా అయితే రూ.12వేలు తీసుకుంటారు అని చెప్పారు. మరో వ్యక్తి.. పేదలు అవి కూడా లేక చందాలు, విరాళాలతో అంతిమయాత్ర నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు.
రెండురోజుల క్రితం వీడియోనే..
కాగా ఈ వీడియో రెండురోజుల నాటిదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రాజమండ్రిలో రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా అంతిమ యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజమండ్రి ఇంచార్జి ఆకుల సత్యనారాయణతో పాటు మరికొంత మంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు భేటీ అయ్యారు.ఆ భేటీలో జరిగిన సంభాషణగా భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ వ్యవహారశైలి ఎలా ఉందో అర్థం అవుతోందనే చర్చ మొదలైంది. కొవిడ్ నియంత్రణ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏం చేయలేదనే అర్థం వచ్చేలా మాట్లాడుకోవడం గమనించాల్సిన విషయమనే చర్చ మొదలైంది. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతనలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.దీంతోపాటు కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.రాష్ట్ర మంత్రి పేర్నినాని మాట్లాడుతూ..పరిస్థితి చేయి దాటాక ఆసుపత్రికి తీసుకొస్తున్నారని చెప్పిన వీడియోను సంక్షిప్తంగా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తోందని, అయితే చంద్రబాబు మాత్రం పలుమార్లు వ్యాక్సిన్‌లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నిస్తున్నారన్నారు. వ్యాక్సిన్లు కేంద్రం చేతిలోని అంశమని, కేంద్రం 50 శాతం తీసుకుంటే..మిగతావి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోందని, ఏపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే తాము కంపెనీలకు లేఖ రాశామని సజ్జల చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేయగిలిగినంత చేస్తోందని, కేసులు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
ఇక ఏపీలో కేసుల విషయానికి వస్తే..గత 24గంటల్లో 1,16,367 టెస్టులు చేశారు.అందులో రికార్డు స్థాయిలో 22,204 పాజిటివ్ కేసులు తేలాయి.అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2344 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం జిల్లాలో 2304, విశాఖపట్నం జిల్లా, నగరం 2113, ప్రకాశం జిల్లాలో 2001, కర్నూలు జిల్లాలో 1985 కేసులు నమోదయ్యాయి.
మొత్తం మీద కరోనా కట్టడి విషయంలో జగన్ సర్కారు చేతులెత్తేసిందనేందుకు ఈ వీడియోనే సాక్ష్యమని టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది చూడాలి.











