వైసీపీ జమానాాలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన మూక దా*డికి సంబంధించిన సూత్రధారులెవరన్న అంశంపై ఇప్పటిదాకా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడిపోయినట్టేనని చెప్పక తప్పదు. ఎందుకంటే… ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం ఉదయం 11గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు సీఐడీ అధికారులు చైతన్యను తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణ ఈ కేసును కీలక మలుపు తిప్పనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చైతన్య విచారణ ముగిసిన వెంటనే ఈ కేసులోని సూత్రధారుల అరెస్ట్ లు తప్పవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
నాడు ఏపీ సీఎంగా ఉన్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం దూషిస్తున్నారన్న ఆరోపణలతో పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో 200 మందికి పైగా వైసీపీ మూకలు మంగళగిరి పరిధిలోని టీడీపీ కార్యాలయంపైకి దూసుకెళ్లాయి. చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు పట్టుకుని దూసుకువచ్చిన వైసీపీ మూకలు టీడీపీ కార్యాలయంలో విధ్వంసాన్ని సృష్టించాయి. కార్యాలయ ఫర్నీచర్ ను ధ్వంసం చేయడంతో పాటుగా అడ్డు వచ్చిన టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగాయి. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. నాటి ఈ దా*డి దృశ్యాలను ఇప్పుడు చూసినా ఒళ్లు గగుర్పొడుస్తుందని చెప్పక తప్పదు. సినిమాల్లో మాదిరిగా మూక దా*డి జరిగినట్లుగా కనిపిస్తున్న ఆ దృశ్యాలు దాదాాపుగా అన్ని రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టించాయి. ఈ దా*డిపై నాడే టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా… కొనసాగుతున్నది వైసీపీ పాలన కాబట్టి… పోలీసులు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు.
తాజాగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ. జనసేనలతో జట్టుకట్టి బరిలోకి దిగిన టీడీపీ… వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి రికార్డు మెజారిటీతో అధికారం చేపట్టింది. ఆ వెంటనే టీడీపీ కార్యాలయంపై దా*డి, నాడు విపక్ష నేతగాఉన్న ప్రస్తుత సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకి దా*డికి యత్నం వంటి కేసులను తిరగదోడిన కూటమి సర్కారు… భవిష్యత్తులో ఈ తరహా దా*డులు చేయాలంటేనే భయపడేలా నిందితులకు శిక్షలు పడాలన్న దిశగా సాగుతోంద. అందులో భాగంగా అప్పటికే లోకల్ పోలీసులు విచారణ చేస్తున్న ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటిదాకా పోలీసులకు చిక్కకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లిన చైతన్య… కేసు సీఐడీకి అప్పగించారన్న విషయం తెలుసుకున్నంతనే తనకు తానుగా లొంగిపోయాడు. ఈ క్రమంలో అతడిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఇదివరకే మంగళగిరి రూరల్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరగగా… చైతన్యను సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.
సీఐడీ పేరు విన్నంతనే ఎక్కడో దాక్కున్న చైతన్య తనకు తానుగా కోర్టులో లొంగిపోయాడంటేనే… సీఐడీ విచారణ అంటే ఎలా ఉంటుందో అతడికి తెలుసనే చెప్పాలి. ఈ క్రమంలో సీఐడీ విచారణలో దా*డికి సంబంధించిన వాస్తవాలన్నింటినీ ఇట్టే బయటపెట్టేయడం ఖాయమని చెప్పక తప్పదు. ఈ లెక్కన ఈ దా*డికి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పిన సూత్రధారులు ఎవరన్న విషయాన్ని చైతన్య సీఐడీ అధికారులకు చెప్పి తీరతాడు. వెరసి ఈ కేసులో సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ తదితరుల అరెస్ట్ లు ఖాయమన్న వాాదనలు వినిపిస్తున్నాయి. చైతన్య సీఐడీ కస్టడీ ముగిసినంతనే ఈ అరెస్ట్ ల పర్వ మొదలయ్యే అవకాశాలున్నట్లు వివ్వసనీయ వర్గాల సమాచారం.