వెలగపల్లి వరప్రసాద్ రావు . 1983 ఆల్ ఇండియా సర్వీసెస్ కు చెందిన ఈ మాజీ అధికారి వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. 2014లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచిన వరప్రసాదరావు, ఆ తరవాత పరిణామాల్లో 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత కొంత కాలంగా పార్టీ అగ్రనేతలపై ఆయన గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నా, తనను ఎవరూ లెక్క చేయడం లేదని వరప్రసాద రావు సన్నిహితుల వద్ద వాపోయారట.
తాజాగా నెల్లూరు జిల్లా గూడూరులోని వరప్రసాదరావు ఇంటి ముందే ఆ పార్టీ నేతలు ధర్నాకు దిగడం కలకలం రేపింది. నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా ఎమ్మెల్యే వరప్రసాదరావుకు లంచం ఇవ్వాల్సి వస్తోందని కొందరు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
పార్టీ నుంచి పంపించేందుకు ఇది వ్యూహమా?
నెల్లూరు జిల్లాలోని అనేక మంది వైసీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పేదలకు సెంటుభూమి కోసం భూసేకరణ వ్యవహారంలో ఓ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు. ఇక ధాన్యం కొనుగోళ్లలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి మద్దతు ధరకు విక్రయించిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు భారీగానే ముడుపులు తీసుకున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు.
అయితే ఇవన్నీ వదిలేసి గూడూరు ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నాడంటూ వైసీపీ నేతలు వరప్రసాదరావు ఇంటి ముందు ధర్నా చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. గూడూరు ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరతాడనే గుసగుసలు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా ఇవ్వక ముందే అవినీతి ముద్ర వేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైసీపీ అధిష్ఠానం భావిస్తోందట. అలా గెంటి వేస్తే అవినీతిని సహించం అనే మెసేజ్ ఇవ్వడంతోపాటు, అవినీతి పరుడుని టీడీపీ అక్కున చేర్చుకుంటోందని కూడా ప్రచారం చేయవచ్చు. ఒక వేళ టీడీపీ తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వరప్రసాదరావుకు కేటాయిస్తే అవినీతి పరుడుకి టీడీపీ టిక్కెట్ ఇచ్చిందనే ప్రచారం కూడా కలసి వస్తుందని వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉందట. అందుకే గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ను పార్టీ నుంచి పొమ్మనకుండా పొగపెడుతున్నారని తెలుస్తోంది.
దళితుడిని కావడం వల్లే చిన్నచూపా….
నెల్లూరు వైసీపీలో అనేక మంది ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా అధిష్ఠానం వారిపై కన్నెత్తి చూడటం లేదు. కానీ ఒక దళితుడు అవినీతికి పాల్పడుతున్నాడంటూ సొంత పార్టీ నేతలతో ధర్నా చేయించడంపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఏ క్షణంలో అయినా వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బాయ్ చెప్పి, టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.
టీడీపీకి ఎలా లాభమంటే..
తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనాతో మరణించారు. ఆయన కుటుంబసభ్యులకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వనున్నట్టు జగన్ హామీ ఇచ్చేశారు. ఈ స్థానంనుంచి బరిలో ఉంటామని బీజేపీ కూడా ప్రకటించేసింది. తెలుగుదేశం అధికారికంగా ప్రకటన ఏమీ చేయలేదు. మరణం వల్ల వస్తున్న ఉప ఎన్నిక గనుక- సాధారణంగా పోటీచేయకుండా సహకరించడం ఒక పద్ధతి. అక్కడ తెలుగుదేశానికి ప్రస్తుతానికి బలమైన అభ్యర్థి కూడా లేరు. ఆ నేపథ్యంలో ఇప్పటిదాకా సైలెన్స్ గా ఉండడానికీ అదే కారణం.
ఇప్పుడు వరప్రసాద్ గనుక.. వైసీపీనుంచి ఇటు జంప్ చేస్తే, ఆయనకే టికెట్ కట్టబెట్టి బరిలో దింపుతారని తెలుస్తోంది. వరప్రసాద్ 2014లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. తిరుపతి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అప్పట్లో ఎంపీగా ఊరూరా తిరుగుతూ పార్టీ కేడర్, ప్రజలతో నేరుగా కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకున్న ఎంపీగా ఆయనకు గుర్తింపు ఉంది. అదే జరిగితే.. తిరుపతి బరిలో ఈసారి గట్టిపోటీ తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
మరో ప్రచారమూ ఉంది..
నిజానికి ఎమ్మెల్యే వరప్రసాద్ భారతీయజనతా పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. మంగళవారం నాడు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయన ఇంటివద్ద ధర్నాకు దిగిన నేపథ్యంలో వరప్రసాద్ నాకు తిక్కరేగితే బీజేపీలోకి పోతా.. అంటూ వ్యాఖ్యానించినట్లుగా సూర్య పత్రిక ప్రకటించింది. నేను ఐఏఎస్ కేడర్ తెలుసా.. అంటూ కార్యకర్తల మీద కారాలు మిరియాలు నూరినట్లు కూడా పత్రికల్లో వచ్చింది. నేను జగన్ వల్ల గెలవలేదు, నా సొంత డబ్బు ఖర్చు పెట్టి గెలిచా.. అంటూ వరప్రసాద్ అన్నట్లుగా వార్తలో పేర్కొన్నారు.
ఇలా జరిగే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఆయన వైసీపీ నాయకుడే అయినప్పటికీ.. ఇటు బీజేపీ, అటు జనసేన నాయకులతో కూడా నిత్యం టచ్‌లో ఉంటుంటారు. పవన్ అనుకూల వ్యాఖ్యలు చేసిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. మరి గూడూరు ఎమ్మెల్యే నియోజకవర్గం, తిరుపతి ఎంపీ నియోజకవర్గాల రాజకీయాలను వరప్రసాద్ ఎన్ని మలుపులు తిప్పుతారో చూడాలి.