కరోనా కి సామాన్యుడైనా ఒకటే, సినీ సెలబ్రిటీ అయినా ఒకటే. అందరినీ కంటిమీద కనుకులేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. ఇటీవల సినీనటుడు రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో జీవిత, శివానీ, శివాత్మికలు కోలుకున్నారు. కాగా రాజశేఖర్ కు దాని ప్రభావం ఎక్కువుండడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అప్పటినుంచీ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గత కొద్దిరోజులుగా రాజశేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. కూతురు శివాత్మిక తన తండ్రి కోసం ప్రార్ధన చేయండి అంటూ.. ట్వీట్ చేయడం అభిమానుల్ని మరింత కలవర పరిచింది.
వైద్యులు కూడా ఆయనకి ఫ్లాస్మా థెరపీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు, అలాగే.. ఆయన ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారంటూ.. బులిటెన్ రిలీజ్ చేశారు. తాజాగా రాజశేఖర్ భార్య జీవిత కీలక ప్రకటన చేశారు. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని.. ఇప్పటికే 80శాతం ఇన్ఫెక్షన్ తగ్గినట్టు చెప్పారు. దాంతో ఆయన త్వరలో ఐసీయూ నుంచి బైటికొచ్చే అవకాశముందని, ప్రతీరోజూ తాము ఆయన ఆరోగ్యంపై డాక్టర్స్ తో మాట్లాడుతున్నామని తెలిపారు. అలాగే.. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు వస్తోన్న వార్తల్ని నమ్మొద్దని ఆయన ఏరోజూ వెంటిలేటర్ మీద లేరని స్పష్టం చేశారు. ఆయన ఫ్రెండ్స్ , బంధువులు, ఫ్యాన్స్ కోసమే ఈ రోజు వీడియో ద్వారా మీ ముందుకొచ్చానని చెప్పారు.