రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడడంతో వైసీపీ అధినేత జగన్ తనదైన రాజకీయ కుట్రలకు తెరతీశారు. తన పార్టీ తరపున నిలబడే ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ద్వారా ఆమోదం తెలిపేలా చేశారు. నిజానికి టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు మూడేళ్ల క్రితమే రాజీనామా చేశారు. అప్పట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగడంతో ఆ ఉద్యమానికి మద్దతు పలుకుతూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు పంపారు. మూడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఆమోదించారు.
వైసీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ తరఫున ఎన్నికైన కనకమేడల రవీంద్ర, సీఎం రమేష్ రాజ్యసభ పదవీ కాలం ముగింపునకు వచ్చేసింది. ఏప్రిల్‌లో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ కాబోతున్నారు. వీళ్ళ స్థానాల్లో కొత్తవారిని ఎన్నిక చేయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తుంది. వైసీపీ అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి మూడు సామాజికవర్గాల నుంచి ముగ్గురు నేతలను ఎంపిక చేయబోతున్నారని సమాచారం ఉంది. పాయకరావుపేట ఎమ్మెల్యే (ఎస్సీ) గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే(కాపు) ఆరణి శ్రీనివాస్‌కు ఛాన్స్ ఉంటుందని సమాచారం. ఈ ముగ్గుర్నీ తానే గెలిపించుకోవాలని జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించి టీడీపీ ఒకరి బలం తగ్గేలా చేశారు.
మరోవైపు, కొద్ది నెలల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కొల్లు పార్థసారథి తదితరులు.. టీడీపీ అభ్యర్థికే ఓటు వేస్తారు కాబట్టి.. పార్టీ మారారనే నెపంతో వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసే యోచనలో జగన్ ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు మరో సీక్రెట్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
అయితే, జగన్‌పై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు కొందరు ఈ ఎన్నికలోనే ఆయనకు దెబ్బ కొట్టాలని యోచనలో ఉన్నారు. అందుకే ఇప్పటికే చంద్రబాబుతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తాము టీడీపీ రాజ్యసభ అభ్యర్థిని నిలబెట్టి కచ్చితంగా ఆయన్ని గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే, కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ పరిస్థితుల్లో వేరే పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ టైంలో చేరితే అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే వైసీపీ నుంచి టీడీపీలోకి లేదా జనసేనలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే వైసీపీలో ఉంటూనే.. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తరహాలో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.