గత నెల రోజులుగా ఏపీలోని అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. జగన్ తనంతతానుగా తమకు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, అంగన్ వాడీ నేతలు కదం తొక్కుతున్నారు. ఎన్ని సార్లు చర్చలు జరిపినా అంగన్ వాడీల గోడును ప్రభుత్వం వినకపోగా, కఠిన చర్యలకు దిగింది. అయినా అంగన్ వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరించినా అంగన్ వాడీ కార్యకర్తలు వినకపోవడంతో జగన్ ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్ వాడీలు తీవ్రంగా ఖండించారు. సాధారణంగా ఎస్మాను అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగుల విషయంలో ప్రయోగిస్తారు. కానీ, అంగన్‌వాడీ సర్వీసులు అత్యవసర సేవల కిందకు రావు. కానీ వాటి పరిధిలోకి తెచ్చి మరీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్ వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకురావడం కోసం జీవో నెంబర్ 2ను జారీ చేశారు. దీనిప్రకారం ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంగన్ వాడీల సమ్మెపై జగన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయినప్పటికీ అంగన్ వాడీ వర్కర్లు కూడా ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుందామని పట్టుదలతో ఉన్నారు. ఎంత బెదిరించినప్పటికీ వారు లొంగకపోవడంతోనే వైసీపీ సర్కారు ఎస్మా ప్రయోగించింది. అయినా వర్కర్లు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది. దీనిపై స్పందించేందుకు మళ్లీ జగన్ సజ్జలను మీడియా ముందుకు పంపారు. ఆయన కూడా జీతాల పెంపు ఉండబోదని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వం వీరి ప్రధాన డిమాండ్లను నెరవేర్చిందని, జీతాల పెంపు మాత్రమే మిగిలుందని సజ్జల చెబుతున్నారు. అంగన్ వాడీల వేతనాల పెంపు ఎన్నికల్లోపు ఉండబోదని ఆయన తేల్చిచెప్పేశారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అంగన్ వాడీల వేతనాలు కూడా తాము పెంచలేమని సజ్జల తెలిపారు. ఎన్నికల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ప్రతి జిల్లాల్లోనూ అంగన్ వాడీ వర్కర్లు రోడ్డెక్కడమే కాకుండా మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్నారు. వారిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ నిలదీస్తున్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న కారును అంగన్వాడీలు సోమవారం అడ్డగించారు. ప్రశ్నలతో ఆయన్ని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. 11 డిమాండ్లలో 10 పరిష్కరించామని.. మిగిలిన ఒక్క డిమాండ్ మూడు నెలల తర్వాత పరిష్కరిస్తామని బుకాయించారు. ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒక్కసారే జీతాలను పెంచుతాయని.. రెండు మూడు ఏళ్లకు ఒకసారి పెంచడం సాధ్యం కాదని బొత్స మాట్లాడారు. ఎలాగో వచ్చే ఎన్నికలలో తామే అధికారంలోకి వస్తామని చెప్పడంతో.. అది కల మాత్రమే అని అంగన్ వాడీలు మంత్రికి కౌంటర్ ఇచ్చారు. ఇదే రోజు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిని కూడా అడ్డగించి అంగన్ వాడీలు ప్రశ్నించారు.
అయితే, జగన్ రెడ్డి అంగన్ వాడీలు ఎంత అణచాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు ప్రభుత్వానికి లొంగకుండా తయారయ్యారు. ఎంతగా బ్లాక్ మెయిల్ చేసినా తగ్గకపోవడంతోనే జగన్ ప్రభుత్వం వారిపై అణచివేత చర్యల్లో భాగంగా ఎస్మా ప్రయోగించింది. అయినప్పటికీ అంగన్ వాడీలు భయపడకుండా తమ హక్కుల పోరాడుతున్నారు. అటు మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కూడా ఉండడంతో.. ఇవి వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్ష్యంగా ప్రభావం చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.











