నాడు తండ్రి వైఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని అనేక ఆరోపణలున్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. మరీ 2019-24 మధ్య స్వయంగా ఆయనే అధికారంలో ఉంటే..ఎంత వెనకేసి ఉంటారో ఊహించలే. తాజాగా ప్రజలను బటన్ నొక్కుడు పేరుతో మాయ చేసి తెరవెనుక భారీ కుంభకోణాలు చేసినట్లు సమాచారం. తాజాగా అధికారం పోయే ముందు అత్యంత రహస్యంగా జరిగిన ఓ భూదోపిడీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భార్య సతీమణి భారతీరెడ్డి యజమానిగా ఉన్న భారతీ సిమెంట్స్‌కు ఏకంగా 744 ఎకరాల సున్నపురాయి లీజును కట్టబెట్టారు. ఎప్పుడో వైఎస్ హయాంలో మొదలైన ఈ తతంగాన్ని…2024లో ఎన్నికల షెడ్యూలుకు కొద్దిరోజులు ముందు ముగించారు. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో విస్తరించిన ఈ గనులను 50 ఏళ్ల కాలానికి కట్టబెట్టారు. జగన్ తనకు తాను చేసుకున్న ఈ సొంత మేలు విలువ కనీసం రూ.3వేల కోట్లు ఉంటుందని సమాచారం.
భారతీ సిమెంట్స్‌కు భూ పందేరం ఇవాళ మొదలైంది కాదు. ఈ ప్రక్రియ వైఎస్ సీఎంగా ఉండగా మొదలైంది. ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిధిలో 2037.52 ఎకరాల్లో ఉన్న సున్నపురాయి నిక్షేపాలను రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీకి 2006 మార్చి 27న కట్టబెట్టారు. సిమెంటు తయారీలో కీలకమైన అత్యంత నాణ్యమైన సున్నపురాయి నిల్వలు ఇక్కడున్నాయి. మహా అయితే 10 మీటర్ల లోతు వరకు సరైన నాణ్యత లేని సున్నపురాయి వచ్చినా, ఆ తర్వాత మరో 250 మీటర్ల లోతు వరకు శ్రేష్టమైన ఖనిజం వస్తుంది. అయితే..475.16 ఎకరాల్లో తాము ఆశించిన ఖనిజం లేదంటూ 2008 నవంబరు 7న ఆ భూమిని రఘురామ్ సిమెంట్స్ సర్కారుకు వెనక్కి ఇచ్చింది. ఇక ఆ కంపెనీ వద్ద ఉన్న భూమి 1562.36 ఎకరాలు. ఇందులో..వేర్వేరు గ్రామాల పరిధిలో విస్తరించిన 744.74 ఎకరాలకు మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చారు. ఆ వెంటనే లీజు అమలు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీని ప్రకారం రఘురామ్ సిమెంట్స్ ఆ భూముల్లో లైమ్‌స్టోన్ మైనింగ్ చేపట్టాలి. అయితే…2009 ఫిబ్రవరిలో రఘురామ్ సిమెంట్స్ చేతులు మారిపోయింది. యజమాని కూడా మారిపోయారు. అది…భారతీ సిమెంట్స్‌గా మారింది. దాని యజమాని… జగన్ సతీమణి భారతీ రెడ్డి! దీని వెనుక ఏం జరిగిందన్నది సీబీఐ ఎప్పుడో వెల్లడించింది! రఘురామ్ సిమెంట్స్‌ను భారతీ సిమెంట్స్‌గా మార్చుకోవడానికి వైఎస్ ప్రభుత్వం 2009 ఫిబ్రవరి 13న ఉత్తర్వులు GO-54 ఇచ్చింది. ఈ జీవోతో అన్నీ అయిపోతాయని, రఘురామ్ సిమెంట్స్ పేరిట ఉన్న వేలకోట్ల విలువైన లైమ్‌స్టోన్ లీజులు, మైనింగ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎల్‌ఓఐ, ఇతర పర్యావరణ అనుమతులు కూడా సింపుల్‌గా మారిపోతాయని భావించారు. కానీ, అది జరగలేదు.
రాష్ట్ర విభజన తర్వాత జగన్ తన భారతీ సిమెంట్స్ ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు. మైనింగ్‌కు అవసరమైన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. భారతీ సిమెంట్స్ దరఖాస్తు చేసుకున్న మేరకు మైనింగ్ ప్లాన్‌కు 2014 జూలై 15న కేంద్ర గనుల శాఖ ఆమోదం తెలిపింది. అయితే…అప్పటికి ఆ కంపెనీకి పర్యావరణ అనుమతి , కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ రాలేదు.ఇక్కడమరో కీలక విషయమేంటంటే..తొలుత భూముల లీజు పొందిన రఘురామ్ సిమెంట్స్ దీనిపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. భారతీ సిమెంట్స్‌గా మారిన తర్వాత కూడా ఒప్పందం కుదుర్చుకోలేదు. అంటే, మైనింగ్ ప్లాన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిన 2014 జూలై 15న నాటికి లీజు అమల్లోకే రాలేదన్న మాట.
744 ఎకరాల లీజులెక్క కొలిక్కి రాకముందే..మైనింగ్ చట్టాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. మైనింగ్, మినరల్ (అభివృద్ధి నియంత్రణ) చట్టం-1957ను 2015 జనవరిలో సవరించి..కొత్తగా 10-A అనే క్లాజును చేర్చింది. దీని ప్రకారం అప్పటికే..సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల కాలపరిమితి దానంతట అదే ముగిసిపోతుంది. అంటే, ఇక ఆ దరఖాస్తులు పనికిరావు. మైనింగ్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దీని ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం 2016 నవంబరు 23న రాష్ట్రానికి లేఖ రాసింది. పర్యావరణ అనుమతి లేని ఒప్పందాలకూ ఇదే వర్తిస్తుందని అందులో స్పష్టం చేసింది. ఆ మేరకు… అమల్లోకి రాని లీజుదారులందరికీ రాష్ట్రం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వంతో లీజ్ డీడ్‌పై సంతకాలు చేసుకోని, పర్యావరణ అనుమతులూ పొందని భారతీ సిమెంట్స్‌కూ ఈ నోటీసులు వెళ్లాయి. కేంద్రం చట్టం ప్రకారం లీజు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 2016 డిసెంబరు 30న భారతీ సిమెంట్స్‌కు నోటీసు ఇచ్చింది. దీనిపై కంపెనీ స్పందించలేదు. ఫలితంగా… 2017 జనవరి 10న రఘురామ్ సిమెంట్స్‌కి ఇచ్చిన ఎల్‌ఓఐని సర్కారు రద్దుచేసింది.
జగన్ హయాంలో గనుల శాఖ పనితీరు గురించి చెప్పాల్సిన పనే లేదు. అంతా అడ్డగోలుతనమే. ఇక భారతీ సిమెంట్స్ విషయంలోనూ అదే జరిగింది. ఆనాడున్న గనుల శాఖ కార్యదర్శితో 2021 జనవరి 1న అడ్వొకేట్ జనరల్‌కు ఓ లేఖ రాయించారు. 2009లో జారీ చేసిన జీవో 54కు విరుద్ధంగా లీజులను, ఎల్‌ఓఐని రద్దుచేయించారని, ఇది చెల్లదని అందులో చెప్పించారు. నిజానికి..జీవో 54 అనేది రఘురామ్ సిమెంట్స్‌ను భారతీ సిమెంట్స్‌గా మార్చుకోవడాన్ని ఆమోదిస్తూ ఇచ్చింది. 2015లో కేంద్రం ఎంఎండీఆర్ చట్టంలో చేసిన సవరణ ఆధారంగా షోకాజ్ నోటీసు ఇచ్చి, దానికి సమాధానం రాకపోవడంతో లీజులు రద్దు చేసిన సంగతి మాత్రం దాచేశారు. అంటే… అడ్వొకేట్ జనరల్‌ను తప్పుదారి పట్టించి ఉండాలి. లేదా… అన్నీ తెలిసే ఆయన అబద్ధాలు చెప్పి ఉండాలి.
నిబంధనలు ఉల్లంఘించి భారతికి మేలు
మైనింగ్ మినరల్ (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957కు 2015లో ఒకసారి, 2021లో మరోసారి కేంద్రం చేసిన సవరణల ప్రకారం భారతీ సిమెంట్స్‌కు లీజులు ఇవ్వడానికి వీల్లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. న్యాయ సలహా పేరుతో జగన్ ఈ చట్టాలను తుంగలోకి తొక్కారు. అదే సమయంలో… ఆ చట్ట సవరణలు అనుమతించినట్లుగా 50 ఏళ్ల కాలపరిమితితో లీజులు ఇచ్చుకున్నారు. అంటే, కేంద్ర చట్టాల్లో తనకు నష్టం చేసే నిబంధనలను పక్కన పెట్టేసి, మేలు చేసేవి మాత్రం వర్తింపచేశారన్న మాట!
జగన్ లీజుల దందాపై కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. భారతీ సిమెంట్స్‌కు అన్యాయంగా, అక్రమంగా లైమ్‌స్టోన్ నిల్వలున్న భూములు దోచిపెట్టారని, దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ ఫిర్యాదులోని అంశాలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. భారతీ సిమెంట్స్ లీజుల విషయంలో వాస్తవిక నివేదిక ఇవ్వాలని, ఫిర్యాదులోని అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రం ఆదేశించింది.
సున్నపురాయి గనుల లీజుల రద్దుపై స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు…2023 సెప్టెంబరు 21న దీనిపై తీర్పు చెప్పింది. భారతీ సిమెంట్స్ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోవాలని, వారి అభిప్రాయం వినాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో, గనుల చట్టంలోని నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని భారతీ సిమెంట్స్‌ను హైకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం..భారతీ సిమెంట్స్ సంస్థ ప్రభుత్వం ముందు హాజరై తన వివరణ ఇవ్వాలి. దీని ఆధారంగానే లీజుల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా? లేక కొనసాగించాలా? అనేది తేల్చాలి. కానీ… జగన్ సర్కారు ఈ పనిచేయలేదు. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తే లీజులు పునరుద్ధరించడం అసాధ్యం. అందుకే… హైకోర్టు ఆదేశాల అమలును పక్కనపెట్టి సొంత ఆలోచనను తెరమీదకు తీసుకొచ్చారు. భారతీ సిమెంట్స్‌కు లాభం చేకూర్చేలా… గనుల శాఖ ద్వారా ఒక మాజీ న్యాయమూర్తి న్యాయసలహా కోరారు. వారు ఆశించినట్లుగానే… ‘‘ఎంఎండీఆర్ చట్టంలో 2021లో తీసుకొచ్చిన సవరణలు భారతీ సిమెంట్స్ లీజు హక్కులను రద్దు చేయలేవు’’ అనే సలహానే వచ్చింది. ఇదే సలహాను పాటించాలని 2023 సెప్టెంబరు 22న నాటి అడ్వొకేట్ జనరల్ కూడా చెప్పేశారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందన్న మాట.
2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. 2020…భయంకరమైన కరోనా కాలం. ఆ సమయంలో…ఆయన భారతీ సిమెంట్స్ మైనింగ్‌ప్లాన్ ఆమోదం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం భారతీ సిమెంట్స్ దరఖాస్తు చేసుకుంది. జగన్ కేంద్రం వద్ద తన పలుకుబడి ఉపయోగించి ఇందులో కదలిక తీసుకొచ్చారు. కేంద్రం నుంచి వచ్చిన తనిఖీల బృందం కడప జిల్లాలోని లీజులను పరిశీలించింది. దీంతో పాటు భారతీ సిమెంట్స్ ఇచ్చిన దరఖాస్తునూ పరిశీలించి..అనేక ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తింది. మీకున్న లీజుల సంగతేమిటి? అవి ఎలా వచ్చాయి? కంపెనీ పేరు ఎలా మారింది? మైనింగ్‌ప్లాన్‌ను మార్చాలని ఎందుకు ప్రతిపాదించారు? అసలు దీనికున్న హేతుబద్ధత ఏమిటో వివరించండి. మేం నమ్మదగిన కారణాలు చెప్పండంటూ 2020 ఫిబ్రవరిలో ఇచ్చిన తనిఖీ నివేదికలో ప్రశ్నించింది. ఆ తర్వాత ఇదే నివేదికను జోడించి..తమకు వాస్తవాలే చెప్పాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కూడా లేఖ రాసింది. నమ్మదగిన కారణాలు ఏవీ చెప్పలేని అసహాయత నేపథ్యంలో… భారతీ సిమెంట్స్ దీనిపై నోరెత్తలేదు. ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. దీంతో… అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తప్పుడు దారిలో లీజులు కొట్టేసే ప్రణాళిక రచించారు.
సర్కారు ఎల్‌ఓఐని రద్దు చేయడంపై 2017 ఏప్రిల్ 13న హైకోర్టులో భారతీ సిమెంట్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎల్‌ఓఐ రద్దును నిలిపివేయాలని కోరింది. ఈ విషయంలో స్టేట్‌సకో పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలాఉండగానే, 2021 మార్చి 23న ఆ కంపెనీకి మరో దెబ్బ తగిలింది. ఎంఏడీఆర్ చట్టంలో మరోసారి కేంద్రం సవరణలు చేసింది. ఈ సారి 10(ఏ)తోపాటు 2(బి)ని జతపరిచింది. దీని ప్రకారం….ఈ సవరణ జరిగే నాటికి అమలులోకి రాని మైనింగ్ లీజులు, మంజూరు కాని దరఖాస్తులకు సుమోటోగా కాలం చెల్లిపోతుంది. భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన 744 ఎకరాల సున్నపురాయి లీజు అమలులోకి రాలేదు కాబట్టి… అది రద్దయినట్లే!
2024 ఫిబ్రవరి! రాష్ట్రమంతా అప్పటికే ఎన్నికల సందడి నెలకొంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అదే సమయంలో… ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లోని రెండు మైనింగ్ లీజులను భారతీ సిమెంట్స్‌కు పునరుద్ధరించేశారు. ఫిబ్రవరి 2న జీవో 4, 5లు జారీ చేశారు. వెంటనే లీజు అమల్లోకి వస్తుందని హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ హయాంలో అన్నీ చీకటి జీవోలే . భారతీ సిమెంట్స్‌కు గుట్టుగా ఇచ్చేసిన లీజుల జీవోలూ చీకట్లోనే ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చినా వీటిని వెలుగులోకి తీసుకురాలేకపోయింది.