జగన్ అనుకున్నదంతా అయింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఏది తాను చూడకూడదనుకున్నారో అదే అయింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. తెలంగాణ ప్రజల మాదిరిగానే కొద్ది నెలలుగా జగన్ కూడా ఫలితం కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. మొత్తానికి తెలంగాణ బీఆర్ఎస్ ఓడిపోవడం అనేది ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు జీర్ణించుకోలేని పరిణామమే. తన మిత్రుడైన కేసీఆర్ ఫాం హౌస్‌కి వెళ్లిపోవడంతో ఇక తన సంగతి ఏంటని తాడేపల్లిలోని జగన్‌కి టెన్షన్ పట్టుకుంది. మరో నాలుగు నెలల్లో తన పరిస్థితి కూడా అలా అవుతుందేమోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలవడం కోసం.. తెలంగాణలో అప్పటికే రెండోసారి ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు పలికింది. అప్పుడు అంత సంపూర్ణంగా కేసీఆర్ జగన్ కు మద్దతు పలకడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – కాంగ్రెస్ తో కలిపి పోటీ చేయడం కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు. తెలంగాణలో తమను ఓడించడానికి అలా ప్రయత్నాలు చేసిన చంద్రబాబుకు.. ఏపీలో అధికారం ఊడగొడతామని అహంకారంతో వ్యాఖ్యలు చేశారు. దాన్నే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ అన్నారు. దాంతో కేసీఆర్ విచ్చలవిడిగా జగన్ కు మద్దతు ఇచ్చారు. మొత్తానికి 2019 ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచింది.
ఐదేళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ప్రభుత్వంలో లోపాలు ఎన్నో ఉన్నప్పటికీ కేసీఆర్‌కు ఉన్న అహంకారమే ప్రధానంగా ఆయన్ను గద్దె దించిందనే అభిప్రాయాలు చాలా ఉన్నాయి. దీంతో తన మిత్రుడు అధికారం కోల్పోయేసరికి జగన్‌లో బాధ మొదలైంది. తెలంగాణలో వచ్చిన ఆ మార్పే ఏపీలోనూ వస్తుందని జగన్ తెగ కంగారు పడుతున్నారు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను ఇప్పుడు చంద్రబాబు.. తెర వెనుక తన వ్యూహంతో మౌనంగా ఉంటూనే తిరిగి కేసీఆర్‌కు ఇచ్చేశారని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. మొత్తానికి చంద్రబాబుకు శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణలో బాస్ కావడం.. ఏపీలో జగన్ రెడ్డికి ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు టీడీపీకే ఉంటుంది. కాబట్టి, ఇక జగన్మోహన్ రెడ్డి ఆశలు మరింత సన్నగిల్లినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.