రాజకీయాలలో ఎంతో సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావు పరిస్థితి ఏమిటి? ఆయనకేం బాగానే ఉన్నాడుగా అంటారా? మీరు తప్పులో కాలేసినట్లే. రాష్ట్ర మంత్రిగా ఉన్నా కూడా ధర్మాన ప్రసాదరావుకు ఏ మాత్రం విలువ లేకుండా పోతున్నది.
సిగ్గు విడిచి సీఎం జగన్ ను ప్రాధేయపడుతున్నట్లు ధర్మాన మాట్లాడుతున్నా కూడా ఆయన మాత్రం కనికరించడం లేదని అంటున్నారు. సీఎం జగన్ ‘‘సూట్ కేస్’’ కంపెనీలపై గతంలో చేసిన వ్యాఖ్యలు ధర్మాన ప్రసాదరావును వెన్నాడుతున్నాయని కూడా అంటున్నారు. జగన్ సూట్ కేసు కంపెనీలు పెట్టి అక్రమ సంపాదన మళ్లించుకున్నాడని గతంలో ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనంతర పరిణామాలలో ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చింది. వైసీపీలో చేరిన నాటి నుంచి… ఆ తర్వాత మంత్రి అయిన నాటి నుంచి కూడా ధర్మాన ప్రసాదరావు జగన్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. జగన్ అవతార పురుషుడని ఆయన చెబుతున్నారు. అయినా సరే జగన్ కనికరించడం లేదట.
ధర్మాన ప్రసాదరావుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదని అంటున్నారు. ఆయన్ని ఎంపీగా నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారట. ఎంపిగా వెళ్లడం ధర్మానకు ఇష్టం లేదు. అక్కడ ఎంపిగా గెలవడం అసాధ్యం అని ధర్మాన స్థిర అభిప్రాయం.
తాజాగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలో భాగంగా జగన్ చేసిన వ్యాఖ్యలే ధర్మాన సీటు గల్లంతుకు కారణమని తెలుస్తోంది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా తమ పని తీరు మార్చుకోవడం లేదని ఈ సందర్బంగా జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని, అవినీతి ఆరోపణలు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం.
అలాంటి ఎమ్మెల్యేల 20 నుంచి 30 మంది వరకూ ఉన్నారని జగన్ అన్నారని టాక్. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్ దక్కదంటూ జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ జాబితాలో ధర్మాన ప్రసాదరావు పేరు కూడా ఉందని టాక్.
జగన్ చేయించిన సర్వేల్లో ధర్మాన ప్రసాదరావు వెనకబడి ఉన్నట్లు తేలిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన వరుసగా రెండు సార్లు (2004, 2009) గెలిచారు. కానీ 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ తర్వాత నియోజకవర్గంలో డెవలప్మెంట్ పనులపై ధర్మాన ఫోకస్ పెట్టలేదని సమాచారం.
మరోవైపు భూములు ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మూణ్నాలుగు సార్లు చేయించిన సర్వేల్లోనూ ధర్మానకు వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చాయని తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ధర్మానను తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన్ని ఎంపీ ఎన్నికల్లో బరిలో దింపే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది . సో చూడాలి మరి దీనిపై జగన్ ఎం చేస్తారో..