ఏపీలో ఓ సంచలన వార్త హల్ చల్ చేస్తోంది. వైఎస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవాడ పర్యటన సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నందున వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారని విస్తృత ప్రచారం ఊపందుకుంటోంది. అయితే, ఈ ప్రచారంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం ఖండించనూ లేదు.
మౌనం అర్ధ అంగీకారం కాబట్టి.. నిజమేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ మౌనంగా ఉండడం అంగీకారమా? లేక ఉదాసీనతా? అనేది అర్థం కావడం లేదని ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ జరుగుతోంది. మొత్తానికి జగన్ రాజీనామా ప్రచారం వైసీపీ శ్రేణులను విపరీతమైన గందరగోళానికి గురి చేస్తోంది. ఒకవేళ ఆ ప్రచారం నిజమై.. జగన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే అది పెద్ద రిస్కే అవుతుందని అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి ప్రస్తుతం కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి కేవలం 60 వేల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు కూటమి చేతిలో అధికారం ఉంది. మొత్తం టీడీపీ, జనసేన హవానే నడుస్తోంది. ఒకవేళ కడపకు ఉప ఎన్నిక వస్తే.. కడప ఎంపీ సీటు చేజారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆ మాత్రం జగన్ రెడ్డి ఊహించనంత అమాయకుడు కాదు. ఆ ఉప ఎన్నికలకు వెళ్లడం అంటే.. సొంత పార్టీ శ్రేణులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లే అవుతుంది. ఇక వారు నేరుగా ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు జగన్ స్వయంగా గేట్లు తెరిచినట్లు అవుతుంది.
జగన్ రాజీనామా చేస్తారన్న ప్రచారంపై వైసీపీ మౌనం వహిస్తున్న తీరు, మరింత నష్టాన్ని చేకూరుస్తోంది. జగన్ రాజీనామాతో పులివెందుల నుంచి ఆయన తల్లి విజయమ్మ లేదా సతీమణి భారతి పోటీ చేస్తారని చెబుతున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తర్వాత విజయమ్మ గెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ విషయంలో జగన్ లేదా ఆయన ముఠా స్పష్టత ఇవ్వకపోతే వైసీపీ నేతలను మరింత గందరగోళానికి గురి చేసినట్లే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.











