వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వంలో సకల మంత్రిత్వశాఖలను ఒంటిచేత్తో పాలించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు విపరీతంగా టార్గెట్ అవుతున్నారు. టీడీపీ లేదా జనసేన అధినేతలు ఆయన్ను టార్గెట్ చేయడం లేదు. సోషల్ మీడియా ప్రపంచం ప్రస్తుతం సజ్జలను ఏకిపారేస్తోంది. వైఎస్ఆర్ సీపీ ఇంతటి దీనావస్థకు రావడానికి ఆయన సంకుచిత, నీచమైన చర్యలే కారణమని నెటిజన్లు కోడై కూస్తున్నారు. సజ్జలపై సొంత పార్టీ సభ్యులే విరుచుకుపడుతుండగా.. అటు వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి పరువు తీసేస్తున్నారు.
కొంతమంది నాయకులు మొదట్లో ఆయన పేరును ప్రస్తావించి బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడు వైసీపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ కింద చేసిన కామెంట్లతో సజ్జలను మరింతగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ అభిమానుల నుంచి వందలాది ట్రోల్స్, నెగటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి. నిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున మాట్లాడిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఎప్పటిలాగే టీడీపీపై, వారి మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అధికారిక ఎక్స్ ఖాతాలో సజ్జల వీడియోను పోస్ట్ చేశారు. దాని కింద ఉన్న కామెంట్లు చూస్తే అసలు సజ్జల తల ఎక్కడ పెట్టుకుంటారో అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
వాటిలో కొన్ని కామెంట్లు ఇవీ. అయితే, నెటిజన్లు రాసిన అసలైన కామెంట్లను యథాతథంగా ఇవ్వలేదు. వారు వాడిన భాష మరీ అసభ్యంగా, బూతులతో ఉన్నందున సాధారణ కామెంట్లనే ఇక్కడ పేర్కొంటున్నాం. ‘‘మాట్లాడడానికి నువ్వెవరు సజ్జలా? దయచేసి వెళ్ళిపో! పార్టీ ఓడిపోవడానికి నువ్వే కారణం’’, ‘‘నువ్వు ఇలాగే కనిపిస్తే భవిష్యత్తులో వైసీపీ ఒక సీటుకే పరిమితం అవుతుంది’’, ‘‘సజ్జల సార్ ఇలా కనిపిస్తున్నంత కాలం టీడీపీ అజేయంగా నిలుస్తుంది’’, ‘‘సార్! మీరు వైసీపీని ఒంటిచేత్తో ఓడించారు. ఇది చాలు.. దయచేసి వెళ్లిపోండి’’ అని ఎద్దేవా చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
ఇంకా ఇదే వీడియో కింద సజ్జల రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా చాలా కామెంట్లు ఉన్నాయి. అయితే, వాటిలో ఉన్న బూతులు చూస్తే సజ్జల బతికే సాహసం కూడా చేయబోరని మరొకరు కామెంట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. అంతటి ఘోరమైన కామెంట్లు వస్తున్నప్పటికీ వైఎస్ఆర్ సీపీ అధికారిక ఖాతా మేనేజ్ చేసేవారు.. చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. ఇలా సజ్జలపై ఘాటైన విమర్శలను వారు స్వాగతిస్తుండడం మరింత చర్చనీయాంశం అవుతోంది.