గిరగిరా తిరుగుతోంది ఫ్యాన్.. అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాన్… ఇదీ గత ఎన్నికలలో వైసీపీ థీమ్ సాంగ్..ఈ పాట ఎంతో పాపులర్ అయింది. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్యాచీగా, ఆకట్టుకునేలా సాగింది.. నాలుగేళ్లలోనే సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది.. ఫ్యాన్ రెక్కలు ఊడుతున్నాయో, ఆ పార్టీ బ్యాటరీ పనిచేయడం లేదో తెలియదు కానీ, ఉత్తరాంధ్రలో ఫ్యాన్ జీరో మీద తిరుగుతోందనే ప్రచారం జరుగుతోంది..
గత ఎన్నికలలో వైసీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టడంలో ఉత్తరాంధ్ర కీలకంగా మారింది.. వైజాగ్ లో ఆ పార్టీ కాస్త వెనుకబడినా విజయనగరం జిల్లాని స్వీప్ చేసింది.. ఇటు శ్రీకాకుళంలో ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గంలో మినహా.. ఫ్యాన్ హై స్పీడ్ లో తిరిగింది.. అక్కడ టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విజయం సాధించారు..
తాజాగా ఉత్తరాంధ్రలో పరిస్థితిపై తెప్పించుకున్న పలు సర్వేలు.. ఆ పార్టీ పెద్దల కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయట. గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న స్థానాలలో వైసీపీ జెండా ఎగరేసింది.. అధికారంలోకి వచ్చిన వైసీపీ దానిని క్యాష్ చేసుకోవడంలో ఫెయిలయిందనే చర్చ సాగుతోంది.. ఉత్తరాంధ్రకు రాజధాని తీసుకువస్తామని చెప్పినా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువత జగన్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.. అభివృద్ది లేకపోవడం, పరిశ్రమలను తీసుకురాకపోవడంతోపాటు అధికారంలోకి రావడానికి హామీ ఇచ్చిన మెగా డిఎస్సీని సైతం ప్రకటించలేదు జగన్.. ఇటు జాబ్ కేలండర్ ని ఇవ్వకపోవడం, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ లు లేకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురయింది..
మరోవైపు, ఉత్తరాంధ్రలో రాజధాని పేరుతో ఆ పార్టీ సీనియర్ నేతలు చేసిన దోపిడి, భూ కుంభకోణాలు సైతం వైసీపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి.. ఇటు ఉత్తరాంధ్ర జనబాహుళ్యంలో విస్తృత ప్రజాదరణ కలిగిన టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేయడం, అర్ధరాత్రి గోడ దూకి మరీ అరెస్ట్ చేయడాన్ని ప్రశాంత ఉత్తరాంధ్ర జీవనాన్ని దెబ్బ తీసింది. వారి మనో భావాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. మరోవైపు, చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రకు వచ్చిన పరిశ్రమలను జగన్ తరిమికొట్టారనే అభిప్రాయం ఉంది.. ఇటు, చంద్రబాబు వేసిన ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ రోడ్ మ్యాప్ ని జగన్ చెల్లా చెదురు చేశారు. ఇవన్నీ వైసీపీపై వ్యతిరేకతను పదింతలు చేసింది… తాజాగా ఆ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేతలకి సైతం ఓటమి భయం పట్టుకుంది..
ఇదే ఇప్పుడు జగన్ టీమ్ ని కలవరపెడుతోందట.. ఇప్పటికే చేతులు కాలిపోయాయి.. ఫ్యాన్ స్పీడ్ జీరో అయింది.. ఇక, ఒకటీ రెండు స్పీడ్ కి పెంచాలన్నా.. బ్యాటరీ సంగతి పక్కనపెడితే పవర్ కూడా లేదనే చర్చ సాగుతోంది.. మరి, జగన్ దీనిపై ఎలాంటి వ్యూహం రచిస్తాడో చూడాలి.