వైసీపీ జమానాలో వేల కోట్ల ఆస్తులను కారు చౌకగా జగన్ అండ్ కోకు అమ్మేసుకుని… బతుకు జీవుడా అంటూ బయటపడిన ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వరరావు ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఢిల్లీ లిక్కర్ కేసులో అడ్డంగా దొరికిపోయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలను విచారించిన ఈడీ… కేవీరావు నుంచి పలు కీలక వివరాలను రాబట్టింది. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ సుదీర్ఘంగా 9 గంటల పాటు సాగగా… కాకినాడ సీ పోర్టు, సెజ్ లను వైసీపీ నేతలు కేవీ రావు నుంచి లాక్కున్న వైనాన్ని ఈడీ అధికారులు సమగ్రంగా తెలుసుకున్నారు.
విచారణలో భాగంగా కేవీ రావు ఈడీ అదికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారట. అంతేకాకుండా గతంలో సీఐడీ అదికారులకు ఫిర్యాదు చేసిన సందర్భంగా వెల్లడించిన వివరాలను ఆయన ఈడీ ముందు పూర్తిగా పరిచేశారట. అంతేకాకుండా తనపై అటు సాయిరెడ్డి గానీ, ఇటు విక్రాంత్ రెడ్డి గానీ చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదని కూడా ఆయన చెప్పారట. అంతేకాకుండా… తనను వారు బెదిరించినట్లుగా తన వద్ద ఉన్న ఆధారాలను, కాల్ డేటాను ఆయన ఈడీ అధికారులకు అందజేశారట. వెరసి అసలు కేవీ రావు అంటే ఎవరో తనకు తెలియదంటూ సాయిరెడ్డి చెప్పిన మాట అబద్ధమని ఈడీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో తాను కేవీ రావును బెదిరించలేదంటూ విక్రాంత్ చెప్పిన విషయం కూడా అసత్యమేనని కూడా వారు ఓ అంచనాకు వచ్చారట. ఫలితంగా నిందితులు ముగ్గురిని మరోమారు విచారణకు పిలవాలని ఈడీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఈడీ అధికారుల విచారణ సందర్భంగా కేవీ రావు పలు సంచలన విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… తన వద్ద నుంచి కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్ లకు సంబంధించిన వాటాలను పేరుకే అరబిందో రియాలిటీ పేరిట బదలాయించుకున్నారని చెప్పిన రావు… వాస్తవంగా అవన్నీ జగన్ ఖాతాలోనే పడిపోయాయని తెలిపారట. తొలుత ఆడిట్ సంస్థలను రంగంలోకి దించి… తనను భయభ్రాంతులకు గురి చేశారన్న రావు… ఆ తర్వాత సాయిరెడ్డి నేరుగా తనకే ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డితో మాట్టాడుకోవాలని సూచించారట. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన రావును విక్రాంత్ రెడ్డి ఓ రేంజిలో భయపెట్టారట.
తాను చెప్పినట్లుగా పోర్టు, సెజ్ వాటాలు బదలాయించకపోతే… మొత్తం కుటుంబం అంతా జైల్లో కూర్చుంటుందని రావును ఆయన బెదిరించారట. ఈ విషయాన్ని తాను జగన్ వద్ద పెడతానని రావు అనగా… జగన్ చెబితేనే తాము ఇదంతా చేస్తున్నామని విక్రాంత్ చెప్పాడట. దీంతో పథకాన్ని రచించిన జగన్ వద్దకు వెళ్లినా తనకు ఒరిగేదేమీ లేదన్న అంచనాకు వచ్చిన తాను… విక్రాంత్ చెప్పిన చోట సంతకం పెట్టేసి… వారు ఇచ్చిన సొమ్ము తీసుకుని బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయానని తెలిపారట. జగన్ పథకం రచించారంటే… ఆ ఆస్తులను తాను కొట్టేయడానికేనని, వేరే వారకి కట్టబెట్టేందుకు జగన్ అంతలాఎందుకు బరి తెగిస్తారని కూడా రావు చెప్పారట.