వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏకి తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ల ఎమ్‌ఎల్‌సీ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.. ఆ పార్టీ పోటీ చేయకపోయినా పరోక్షంగా పీడీఎఫ్ అభ్యర్ధులకి మద్దతు ప్రకటించింది.. ముఖ్యంగా గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి అభ్యర్ధులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. రాజధాని ప్రాంతంగా పరిగణించే గుంటూరు -కృష్ణా గ్రాడ్యుయేట్ ఎన్నికలలో బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏకంగా 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు.. ఇక, ఉభయగోదావరి జిల్లాల కూటమి కేండిడేట్ రాజశేఖరం వీరబత్తుని 77 వేల ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.. ఈ ఇద్దరు అభ్యర్ధులు సుమారు 70 శాతం ఓట్లను దక్కించుకున్నారు..
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో కూటమి అభ్యర్ధులకి దాదాపు 57 శాతం ఓట్ బ్యాంక్ దక్కింది.. వైసీపీకి 39.17 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.. అంటే కూటమికి, వైసీపీకి మధ్య సుమారు 18 శాతం ఓట్ బ్యాంక్ తేడా ఉంది.. తాజా ఎమ్‌ఎల్‌సీ ఎన్నికలలో ఈ వ్యత్యాసం మరింత పెరిగింది.. మరో 10 శాతం ఎక్కువగా నమోదయింది.. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో విద్యావంతులు కూటమి అభ్యర్ధులకి 67 శాతం ఓట్ బ్యాంక్‌తో బాక్సులు బద్దలయ్యేలా గుద్దారు.. ఇదే వైసీపీని టెన్షన్ పెడుతోంది..
2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మూడు స్థానాలు టీడీపీ దక్కించుకుంది.. జగన్ సర్కార్ అధికారంలో ఉన్నా భారీ తేడాతో ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు.. చివరికి పులివెందులలోకూడా కూటమి అభ్యర్ధులకే మెజారిటీ దక్కింది.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు విద్యావంతులకి నచ్చలేదు.. అమరావతిని కాదని, మూడు రాజధానులతో మూడు ముక్కలాట ఆడాడు వైసీపీ అధినేత. ఇక అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే ప్రజా వేదిక కూల్చి విధ్వంసమే తన ఎజెండా అని సంకేతాలు పంపాడు.. పోలవరం నిలిపేశాడు. అభివృద్ధిని ఆమడ దూరంలో ఆపాడు.. రోడ్ల మరమ్మతు చేయలేదు.. ఇక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఫోకస్ చేయలేదు.. కంపెనీలను ఏపీలో అడుగుపెట్టకుండా చేశారు.. గోరంట్ల మాధవ్ లాంటి ఎంపీలు కియా లాంటి కంపెనీలను సైతం బెదిరించిన విజువల్స్ లైవ్‌లో చూసి షాక్ అయ్యారు ఏపీ ప్రజలు..
2019లో యువకుడైన జగన్.. ఏపీని అభివృద్ది చేస్తాడని, తన కంపెనీలను డెవలప్ చేసినట్లు రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోతాడని భావించి 151 స్థానాలు కట్టబెడితే, జగన్.. వాటిని తన కేసులు తప్పించుకోవడానికి ఉపయోగించుకున్నారు.. అక్రమ సంపాదన, అవినీతికి పాల్పడ్డాడని విద్యావంతులు, యువకులు నమ్మారు.. వారి విశ్వాసాన్ని కోల్పోయాడు జగన్.. 2023లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల నాటికి జగన్ టీమ్‌కి విద్యావంతులకి తాము దూరం అయ్యామని అర్ధం అయింది. అందుకే, వారు మా ఓటర్లు కాదు, వైసీపీ ఓటర్లు సెపరేట్ అని తప్పించుకనే ప్రయత్నం చేశారు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. మరి, నేటి తీర్పుని కూడా జగన్ మా ఓటర్లు కాదని సరిపుచ్చుకుంటారా???? లేక, విద్యావంతుల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా.?? అనేది చర్చనీయాంశంగా మారుతోంది..
మొత్తమ్మీద, జగన్‌కి పట్టాభద్రులు వరసగా ఇచ్చిన షాకులతో ఆయన పట్టా చిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. ఏపీలో గ్రాడ్యుయేట్ స్థానాలు 5 ఉంటే.. అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ, లేదా ఆ పార్టీ బలపరిచిన వ్యక్తులు ఓడిపోవడం ఆశ్చర్యకర విషయం.. ఆ పార్టీని పునరాలోచనలో పడేసే అంశం..