ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘోరమైన ఓటమి మూటగట్టుకోవడానికి ప్రధాన కారణం.. ఆ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన విధ్వంసంతో పాటు వైఎస్ షర్మిల కూడా కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధినేత సొంత చెల్లెలు తెలంగాణలో వేరు కుంపటి పెట్టడం నుంచి జగన్ పతనం మరింతగా దిగజారిపోతూ వచ్చింది. ఇక సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకొని, సొంత సోదరుడిపైనే ఏ మాత్రం జంకు లేకుండా నేరుగా మాటల దాడి చేయడం.. జగన్‌పై ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయేలా చేసింది.
ఇప్పుడు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ ను రాష్ట్రంలో లేపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అల్టిమేట్ ఆయుధం.. పాదయాత్ర. అందులో భాగంగా షర్మిల త్వరలో యాత్ర చేపట్టనున్నారని అంటున్నారు. అయితే, అది పాదయాత్రే అని అంటున్నారు. ఇప్పటికే షర్మిల జగన్ రెడ్డి పూర్తిగా ఓడిపోయి నిస్సహాయుడైన స్థితిలో కూడా ఆయన్ను వదలడం లేదు. విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు.
అయితే, 2014 ఎన్నికలకు ముందు జగన్ జైలులో ఉండగా షర్మిల తన అన్న కోసం 3 వేల కిలో మీటర్ల పాదయాత్ర చేసి.. వైసీపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. జగనన్న వదిలిన బాణం అంటూ జనాల్లోకి వెళ్లారు షర్మిల. ఆ తర్వాత 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కృతజ్ఞత లేకుండా జగన్ సొంత చెల్లినే తరిమేశారు. తల్లిని కూడా తరిమేయడంతోనే.. ఆమె తరచూ షర్మిల వద్దనే ఉంటూ వస్తున్నారు. కాబట్టి, పాదయాత్ర చేయడం అనేది వైఎస్ షర్మిలకు కొత్త విషయం ఏమీ కాదు. 2014కు ముందు ఏపీలో తిరగడంతో పాటు, తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా.. షర్మిల ఏకంగా 3,800 కిలో మీటర్ల మేర ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు.
ఈ పాదయాత్ర 2024 ఎన్నికలకు ముందే షర్మిల ఏపీలో చేస్తారని భావించినా సమయాభావం కారణంగా కుదరలేదు. కానీ, ఇప్పుడు పాదయాత్ర చేయాలని షర్మిల చూస్తున్నారు. ఫలితంగా ఏపీ కాంగ్రెస్ హవాతో వైఎస్ఆర్ సీపీలో సైలెంట్ గా ఉన్న నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అవుతారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే గత ఐదేళ్లలో రెచ్చిపోయి.. ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ నేతలు ఏ పార్టీలోకి వెళ్లలేక గమ్మున ఉన్నారు. వైఎస్ షర్మిల యాత్రతో కాస్త ఆ పార్టీకి జోరు వస్తే.. నెమ్మదిగా వైసీపీలోని అసంతృప్త నేతలంతా కదిలి.. కాంగ్రెస్‌లోకి లేదా మరికొంత మంది టీడీపీ, జనసేనలోకి వెళ్తారని అంటున్నారు. మరోవైపు, భవిష్యత్తులో జగన్ రెడ్డి తన కేసులో ఉచ్చులో చిక్కుకోవడం ఖాయంగా చెబుతున్నారు. అప్పుడు పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం తప్ప మరే దారి లేదని అంచనా వేస్తున్నారు.