దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోరేకెత్తిన వివాదాలు… వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా… ఏకంగా ఆయనను అదికారం నుంచి దింపేశాయని చెప్పాలి. ఇప్పుడు ఆ వివాదాలతో పాటుగా సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు పెట్టిన పోస్టులు… జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని కటకటాల్లోకి నెట్టడం ఖాయమన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ సొంతూరు పులివెందులలో ఏ ఒక్కరిని కదిపినా దీనిపైనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైఎస్ఆర్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కడప ఎంపీ సీటు కోసం వైఎస్ అవినాశ్ రెడ్డే ఈ హత్య చేయించి ఉంటారన్న దిశగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి.ఆ ఆరోపణలు నిజమేనన్న రీతిలో అవినాశ్ రెడ్డితో పాటుగా ఆయన పీఏలు, అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలగిన వారు సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటిదాకా ఈ దిశగా పక్కా ఆధారాలు అయితే లబించలేదు.
తాజాగా సోషల్ మీడియాలోఅనుచిత పోస్టుల వ్యవహారంపై నేరుగా అవినాశ్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి బుధవారం పులివెందుల చేరుకున్నారు. తనతో పాటుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి అనుచిత పోస్టులు పెట్టాడని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఇదివరకే షర్మిల, సునీతలు హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. అదే సమయంలో ఇప్పుడు ఏపీలో కూటమి సర్కారు అదికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనుచిత పోస్టులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై పెట్టిన పోస్టులపై చర్యలు తీసుకోవాలని నేరుగా ఏపీ పోలీసులకే ఫిర్యాదు చేయాలని సునీత భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె బుధవారమే పులివెందుల చేరుకుని… ఈ వ్యవహారంపై ఏరీతిన ఫిర్యాదు చేయాలి?… ఎలాంటి ఆధారాలు ఇవ్వాలి? అన్న అంశాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా సమాచారం.
తన తండ్రిని వైఎస్ అవినాశ్ రెడ్డే చంపించారని సునీత గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా తన తండ్రిని హత్య చేసిన అవినాశ్ రెడ్డిని జగనే వెనకుండి మరీ కాపాడుతున్నారని కూడా ఆమె విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో వీరిపై చర్యల కోసం ఆమె చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు చేతికి చిక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవినాశ్ ను జైలుకు తరలించేలా ఆమె వ్యూహం రచిస్తున్నట్లుగా సమాచారం. ఇటీవలే సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టైన వర్రా రవీంద్రారెడ్డి తన స్టేట్ మెంట్ లో చాలా విషచయాలనే చెప్పాడు. విజయమ్మ, షర్మిల, సునీతలపై తాను పెట్టిన పోస్టులకు సంబంధించిన కంటెంట్ ను అవినాశ్ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న రాఘవ రెడ్డి ఇచ్చారని చెప్పాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అవినాశ్ రెడ్డి స్వయంగా కంటెంట్ ను డిక్టేట్ చేస్తే రాఘవరెడ్డి రాసుకుని… దానిని తనకు పంపేవాడని, దానిని తాను సోసల్ మీడియాలో పోస్ట్ చేేసేవాడినని వర్రా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత చేసే ఫిర్యాదు అవినాశ్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన మరుక్షణమే రాఘవ రెడ్డి పరారీలో ఉన్నాడు. వర్రా అరెస్ట్ అనేకంటే… కడపలోని చిన్నచౌైక్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు మస్కా కొట్టి వర్రా తప్పించుకుని పారిపోయిన మరుక్షణమే రాఘవరెడ్డి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని నాడే పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక వర్రా అరెస్ట్ అయిన తర్వాత అతడు ఇచ్చిన స్టేట్ మెంట్ లో రాఘవరెడ్డి పేరు పదే పదే వినిపించింది. చివరకు అవినాశ్ రెడ్డి పేరు కూడా వినిపించింది. వెరసి వర్రాపై సునీత ఫిర్యాదు ఇచ్చారంటే… రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం తథ్యమని చెప్పక తప్పదు. ఆపై రాఘవరెడ్డి ఇచ్చే స్టేట్ మెంట్, ఇప్పటికే వర్రా స్టేట్ మెంట్ ల ఆధారంగా అవినాశ్ రెడ్డిని పోలీసులు విచారించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ ఊహిస్తున్న అవినాశ్ రెడ్డి… సునీత పులివెందులలో అడుగుపెట్టినంతనే వణికిపోతున్నట్లుగా సమాచారం.