వైఎస్సార్ జగనన్న సెంటు భూమి పథకంలో అక్రమాలు వెలుగుచూడడంతో ప్రజలు ఆగ్రహాంతో ఊగిపోయారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం పొందుగల గ్రామంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా పెద్దలే పంచుకుంటున్నారని పేదలు తిరగబడ్డారు. గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి కట్టిన ఫ్లెక్సీలను చింపివేసి గత రాత్రి తగుల బెట్టారు. అంతటితో ఆగకుండా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పంచిన జగన్ బొమ్మతో కూడిన గోడ గడియాలను పగులగొట్టి తగుల బెట్టారు. వైసీపీ కార్యకర్తలే వైసీపీ అధినేత బొమ్మలను కాలబెట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
నిరుపేదలను పట్టించుకోరా?
పొందుగల గ్రామంలో 40 నిరుపేదల కుటుంబాలను గుర్తించారు. ఎన్నికల ముందే వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ పేదలకు ఇంటి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సెంటు భూమి పంచడంతో తమకూ ఇంటి స్థలం వస్తుందని భావించిన పొందుగల వైసీపీ కార్యకర్తలకు చుక్కెదురైంది. లబ్దిదారుల జాబితాలో 40 కుటుంబాలకు చెందిన లంబాడీ పేదల పేర్లు లేకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, గోడగడియారాలు రోడ్డుపై వేసి నిప్పుపెట్టారు. ఈ వ్యవహారం ఇప్పుడు కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: జగనోరి జమానాలో మరో మోసం : అచ్చెన్న