పరుచూరి గోపాలకృష్ణ ఇంతవరకూ సినీరచయితగా కొనసాగిన తన ప్రయాణం, ఆయా సినిమాల విషయంలో తనకి ఎదురైన అనుభవాలను గురించి మాత్రమే ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో చెబుతూ వచ్చారు. అలాంటి ఆయన ఈ వారం ఎపిసోడ్ లో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నారు.
“నేను డిగ్రీలో ఉండగా .. ఓ పెళ్లికి మా మేనమామ కూతురు విజయలక్ష్మీ కూడా వచ్చింది. అప్పట్లో తెల్లగా .. సన్నగా చాలా చలాకీగా ఉండేది. ఆమెను నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా స్నేహితుడు అశోక్ కుమార్ నాతో అన్నాడు. అప్పటి నుంచి నా మనసులో అది పడిపోయింది.
ఆమెను చూసినప్పుడు నాకు చాలా ముచ్చట అనిపించింది. ఆ పెళ్లి నుంచి ఆమె వెళ్లిపోయిన తరువాత కూడా నాలో ఆమె గురించిన ఆలోచనలే సాగుతున్నాయి. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే లెటర్స్ రాయడం మొదలుపెట్టాను. నేను అంటే తనకి కూడా ఇష్టమే .. తను కూడా నాకు లెటర్స్ రాస్తూ ఉండేది. ఇలా మేమిద్దరం లెటర్స్ రాసుకుంటూ ఉండటం మా మేనమామకి తెలిసిపోయింది. అప్పటికి నేను ఎమ్.ఎ. చదువుతున్నాను .. విజయలక్ష్మీ పెద్దగా చదువుకోలేదు. అందువలన అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దని తనతో మా మేనమామ అన్నాడట. దాంతో నేను తనని పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో చెప్పాను.
ఆడపిల్ల తరఫు వాళ్లు వచ్చి అడగాలి కదా అని మా నాన్న అన్నాడు. దాంతో నేను మా అమ్మను రిక్వెస్ట్ చేశాను. ఆమె చెప్పడంతో మా మేనమామ వచ్చి మా నాన్నను అడిగాడు. అలా మా వివాహమైంది. నన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుని నా జీవితంలోకి అడుగుపెట్టిన నా అర్ధాంగిని, పెళ్లైన కొత్తలో ఒకే ఒకసారి చెంపదెబ్బ కొట్టాను. సాధారణంగా ఆ వయసులో చెంపదెబ్బ కొడితే .. ఎవరైనా ఎందుకు కొట్టారంటూ కోపాన్ని వ్యక్తం చేస్తారు. కానీ విజయలక్ష్మీ అలా చేయలేదు. నేను కొడితే నన్ను పట్ట్టుకునే ఏడ్చింది.
ఆమె అలా చేయడంతో నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. తల్లిలేని పిల్ల .. అమ్మమ్మ దగ్గర పెరిగింది .. నాపై ప్రేమతో వచ్చింది .. అలాంటి అమ్మాయిపై చేయిచేసుకున్నానా? అని ఆ క్షణం చాలా బాధపడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆమెను నేను ఏమీ అనలేదు. కుటుంబ వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకుంటుంది .. నేను కల్పించుకోను .. ఎందుకంటే ఆమె అంటే అంత నమ్మకం” అంటూ చెప్పుకొచ్చారు.











