ఇటీవల వైసీపీలో చేరిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆసక్తికర ప్రకటన చేశారు. వైసీపీ నాయకత్వ బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కొన్నాళ్లుగా ఫ్యామిలీలో విబేధాల వల్ల విజయమ్మ జగన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శైలజానాథ్ ఇలాంటి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో వైఎస్ క్యాబినెట్‌లో శైలజానాథ్ మంత్రిగా పని చేశారు.
రెండు,మూడు రోజుల క్రితం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న శైలజానాథ్..అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ యాక్టివ్‌గా ఉన్నారని, వైసీపీ నాయకత్వ బాధ్యతలను విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఐతే జగన్ కుటుంబంలో విబేధాల గురించి అక్కడి మీడియా ప్రశ్నించింది. వైఎస్ రాజశేఖరరెడ్డిపై తమకు ఆరాధన భావం ఉందని, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్ల మధ్య ఇటువంటి ఉండకూడదని వైఎస్ అభిమానులుగా తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలకు ఇప్పటికైనా ఎక్కడో ఓ చోట ఎండ్ కార్డు పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
నిజానికి విజయమ్మ వైసీపీలో గతంలో కీలకంగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ తరపున పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఐతే తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న విజయమ్మ..పార్టీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగారు. 2019 ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. షర్మిలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. ఐతే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్యతో కుటంబంలో విబేధాలు మొదలయ్యాయి. జగన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఆస్తుల విషయంలో సొంత చెల్లెలు షర్మిలను దూరం చేసుకున్నారు జగన్. దీంతో క్రమంగా విజయమ్మ సైతం జగన్‌కు దూరం జరిగారు. 2022లో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు.
ఇక ఇటీవల ఆస్తుల విషయంలో జగన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు విజయమ్మ. షర్మిలకే తన మద్దతు తెలిపారు. సరస్వతీ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతీ అబద్ధాలు చెబుతున్నారని, వాటి వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటూ NCLTలో కౌంటర్ దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ వైసీపీ బాధ్యతలు తీసుకోవాలని కోరడం హాస్యాస్పదమే.