తిరుమలలో పులుల సంచారం వెనక వైసీపీ నేతల మాస్టర్ ప్లాన్..???
తిరుమల కొండపై శ్రీవారి నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తున్నాయి.. ఇటీవల ఒక చిరుత లక్షిత అనే బాలికను పొట్టనపెట్టుకుంది.. తాజాగా లక్షితను చంపిన ప్రదేశంలోనే మరో రెండు చిరుతలను అటవీ అధికారులు బంధించారు.. ఇంకా అదే ప్రదేశంలో మరో నాలుగు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు లెక్కలు కడుతున్నారు.. మరోవైపు, చిరుతలనుండి రక్షించుకోవడానికి కొండ ఎక్కి దేవదేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటున్న పాదాచార భక్తుల రక్షణ కోసం కర్రలు ఇస్తున్నారు టీటీడీ అధికారులు.. దీనిపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతున్నా ప్రస్తుతానికి అంతకుమించిన ఏర్పాట్లు ఏమీ చేయలేని పరిస్థితిలో చిక్కుకుంది టీటీడీ..
తిరుమల కొండపై గతంలో ఎన్నడూలేని విధంగా పులులు సంచరించడంపై భిన్న కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇటీవల బీసీవై పార్టీ అధినేత రామ చంద్ర యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.. తిరుమలలో పులుల సంచారంపై ఆయన చేస్తున్న ఆరోపణలు పెనుదుమారం రేపుతున్నాయి.. గత ఎన్నికలలో జనసేన తరఫున పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై పోటీ చేసిన రామచంద్ర యాదవ్… చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి.
“ఎన్నడూ లేని విధంగా తిరుమల నడక దారుల్లో చిరుతలు సంచరిస్తున్నాయి.. చిన్నారులపై దాడులు చేస్తున్నాయి.. చిరుతలతో సహా ఎలుగు బంట్లు కూడా విచ్చలవిడిగా ఆ దారుల్లో సంచరిస్తూ భక్తులను బలిగొంటున్నాయి..”
దీనికి ప్రధాన కారణం ఎర్ర చందనం స్మగ్లింగ్.. అధికార పార్టీ అండదండలతో కొందరు అరాచక వాదులు, అవినీతి పరులు.. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పెద్దాయన సహకారంతో విచ్చలవిడిగా ఎర్ర చందనం దొచుకెళ్తున్నారు.. ఈ క్రమంలో శేషాచలం అడవుల్లో రేయింబవళ్ళు తేడా లేకుండా కొన్ని సందర్భాల్లో బ్లాస్టింగ్స్ చేస్తున్నారు.. అక్కడ ఉన్న జంతువులను తరిమెస్తే వాళ్ళ పని సులువు అవుతుందనీ ఎర్ర చందనం దొంగలు ఈ మధ్య బ్లాస్టింగ్ చేస్తున్నారు.. ఆ పెద్ద పెద్ద శబ్దాలకు భయపడి జంతువులు రక్షణ కోసం.. ఇలా మానవ సంచార ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి..!
వచ్చే ఎన్నికల్లో భారీగా ఖర్చులు చేయడానికి.. అధికార పార్టీ నేతల అండతో ఇటీవల ఎర్ర చందనం దొంగలు మరింత బరి తెగించారు.. వారి కారణంగానే పులులు, ఎలుగుబంట్లు ఇలా తిరుమల కొండపైకి, నడక దారుల్లో వస్తున్నాయి”..
ఈ అంశంపై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇప్పటికే కేంద్ర అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో వెంటనే కేంద్ర అటవీశాఖ స్పందించి, ఎర్ర చందనం అక్రమాలపై విచారణ జరిపించి, తిరుమల భక్తులకు అండగా నిలవాలని ఆయన వీడియో రిలీజ్ చేశారు…
రామచంద్ర యాదవ్ వ్యాఖ్యలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఆయన ఆరోపణలు కొట్టిపారేయడానికి వీలు లేదని చెబుతున్నారు పలువురు అటవీ అధికారులు, సీనియర్ రాజకీయ నేతలు.. లేదంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అన్ని చిరుతలు జనావాసాలలోకి అడుగు పెడుతుండడం కలవరపెడుతోంది.. ఇటీవల టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.. తిరుపతి స్థానికుడయిన ఆయన.. గతంలో ఎన్నడూ చూడని విధంగా చిరుతలు వస్తున్నాయని, తన చిన్ననాటి నుండి పులులను ఏడు కొండలపై చూడలేదని ఆయన వివరించారు.. ఈ కామెంట్స్‌పై విమర్శలు వస్తున్నాయి.. ఆ సంగతి పక్కనపెడితే, తిరుమల కొండపై పులుల సంచారం వెనుక పెద్ద కథే ఉందనే ఆరోపణలకు భూమన వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి.. మరి, రాబోయే రోజులలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి..