తెలుగు దేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పరిటాల ఫ్యామిలీకి పార్టీ నుంచి కూడా తగినంత మేర గుర్తింపు కూడా దక్కిందనే చెప్పాలి. అందుకే కాబోలు.. పార్టీకి ఏ కష్టమొచ్చినా కూడా వెన్నుదన్నుగా నిలిచే విషయంలో పరిటాల ఫ్యామిలీ అందరికంటే ముందు ఉంటోంది. ఆ దిశగానే దివంగత నేత పరిటాల రవి, మాజీ మంత్రి పరిటాల సునీతల రాజకీయ వారసుడు పరిటాల శ్రీరామ్ ఇప్పుడు మరింత దూకుడు పెంచేశారు. తమ సొంత నియోజకవర్గం రాప్తాడుతో పాటు పొరుగు నియోజకవర్గం ధర్మవరంలోనూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తున్న శ్రీరామ్.. ఇటు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డితో పాటు అటు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వెరసి వైసీపీకి చెందిన ఇద్దరు కుర్ర రెడ్లకు పరిటాల శ్రీరామ్ చుక్కలు చూపిస్తున్నారు.
తోపుదుర్తి దౌర్జన్యాలపై పోరు
2019 ఎన్నికల్లో రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీత.. తన బదులుగా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు అందుకు అంగీకరించారు. సునీత స్థానంలో శ్రీరామ్‌ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ వైపు వీచిన గాలిలో హేమాహేమీలతో పాటు శ్రీరామ్ కూడా ఓటమిపాలయ్యారు. గెలుపు, ఓటమి అన్న దానితో సంబంధం లేకుండా ఓడిపోయినా కూడా టీడీపీ కేడర్‌కు అండగా నిలుస్తూ సాగుతున్న శ్రీరామ్.. ఎమ్మెల్యేగా కొత్త అవతారం ఎత్తిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి దౌర్జన్యాలపై పోరు సాగిస్తున్నారు. అధికారంలో ఉన్నామన్న ధీమాతో తోపుదుర్తి వర్గం ఎక్కడికక్కడ తమదైన శైలి దారుణాలకు పాల్పడుతుంటే.. టీడీపీ కేడర్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శ్రీరామ్ అండగా నిలుస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన పలు ప్రాజెక్టులకు సంబంధించి శిలాఫలకాలను తోపుదుర్తి వర్గం తొలగిస్తూ సాగుతుంటే.. వాటిపై గళం విప్పుతున్న శ్రీరామ్.. టీడీపీ అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ వైసీపీ దుర్మార్గాలకు చెక్ పెడుతున్నారు. శ్రీరామ్ అండతో టీడీపీ శ్రేణులు కూడా వైసీపీ దుర్మార్గాలపై ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.
తాజాగా కేతిరెడ్డి వంతు
ఇక రాప్తాడు పొరుగు నియోజకవర్గం, పరిటాల ఫ్యామిలీకి మంచి పట్టున్న మరో నికయోజకవర్గమైన ధర్మవరంలో టీడీపీకి ఇప్పుడు అండగా నిలిచే నేత లేరనే చెప్పాలి. 2019కి ముందు అక్కడ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన వరదాపురం సూరి.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే.. పార్టీకి హ్యాండిచ్చేసి బీజేపీ పంచన చేరిపోయారు. ఈ క్రమంలో ధర్మవరంలో పార్టీ కేడర్‌కు అండగా నిలిచే వారు లేకుండాపోయారు. అయితే చాలా కాలం నుంచి ధర్మవరం పార్టీ శ్రేణులకు కూడా అండాదండగా నిలుస్తూ వస్తున్న పరిటాల ఫ్యామిలీ.. ఇప్పుడు శ్రీరామ్ రూపంలో మరింతగా దూకుడు పెంచేసింది. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై పరిటాల శ్రీరామ్ తాజాగా విరుచుకుపడ్డారు. ధర్మవరం పట్టణంలోని పురాతన మార్కెట్‌ను కూల్చేసి దాని స్థానంలో కొత్త మార్కెట్‌ను నిర్మిస్తామని ఇటీవలే కేతిరెడ్డి ప్రకటించారు. ఇదే జరిగితే.. పట్టణంలోని మార్కెట్ కళ తప్పడం ఖాయమన్న భావనతో శ్రీరామ్ రంగంలోకి దిగారు. పురాతన మార్కెట్‌ను కూల్చేయడంలో ఎమ్మెల్యే ఉద్దేశమేమిటో తమకు తెలుసని, జనామోదం లేకుండా ఎమ్మెల్యే మార్కెట్‌ను ఎలా కూలుస్తారో తాను చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై కేతిరెడ్డి కూడా కొంత మేర దూకుడు చూపినా.. పరిటాల శ్రీరామ్ ఎంట్రీతో పట్టణంలోని జనంలో వస్తున్న మార్పును చూసి వెనక్కు తగ్గే దిశగా కదులుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా అటు రాప్తాడుతో పాటు ఇటు ధర్మవరంలోనూ టీడీపీ కేడర్‌కు అండగా నిలుస్తూ వస్తున్న పరిటాల శ్రీరామ్.. వైసీపీకి చెందిన ఇద్దరు కుర్ర ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారని చెప్పక తప్పదు.