అధికార వైసీపీలో తీవ్ర అలజడి మొదలయిందా..?? ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీలు హైకమాండ్‌కి హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారా.??? మమ్మల్ని వదిలేసి వేరే వాళ్లను చూసుకోవాలని షరతులు పెడుతున్నారా.??. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. వైసీపీకి గత ఎన్నికలలో 22 ఎంపీలు వచ్చాయి.. ఈ 22 మంది ఎంపీలలో ప్రస్తుతం ముగ్గురు మినహా.. మిగిలిన 19 మంది ఎంపీలు తాము బరిలోకి దిగలేమని, కావాలంటే ఎమ్‌ఎల్‌ఏలుగా పోటీ చేస్తామని తాడేపల్లి ప్యాలెస్‌లోని అధిష్టానానికి విన్నవిస్తున్నారట.. ఇదే ఇప్పుడు జగన్ టీమ్‌కి మింగుడు పడడం లేదు… ఎంపీ రేసులో ఎవరిని నిలబెట్టాలో తెలియక తెగ కంగారు పడుతోందట వైసీపీ హైకమాండ్..
ఏపీలో జగన్ సర్కార్‌పై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని లెక్కలు వేసుకుంటున్నారట మెజారిటీ ఎంపీలు. అదనంగా టీడీపీ – జనసేన పొత్తు తమ కొంప ముంచుతుందని అంచనాలు ఉన్నాయి.. వీటికి తోడు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ ఏ అంశంలోనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై పోరాడలేదు. రాష్ట్రానికి ఒక్క మేజర్ ప్రాజెక్ట్‌ని తీసుకువచ్చిన దాఖలాలు లేవు. కమళదళంతో కలిసి పని చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే ప్రజాభిప్రాయం ఉంది..
అయిదేళ్లలో జగన్ మేనియా కూడా కరిగిపోయిందని, ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయిందనే భావన కూడా వారిని సిట్టింగ్ ఎంపీ స్థానాల నుండి బరిలోకి దిగడానికి భయపడేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు..
సిక్కోలులో గతంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై పోటీ చేసిన దువ్వాడ ఈ దఫా తన వల్లకాదని చేతులు ఎత్తేస్తున్నారట.. ఇటు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం తాను ఎంపీగా పోటీ చేయనని, ఎమ్‌ఎల్‌ఏగా అయితేనే చేస్తానని పట్టుపడుతున్నారు.. ఇటు, వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణదీ సేమ్ సీన్.. ఇదే బాటలో అనకాపల్లి, అరకు, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, బాపట్ల, చిత్తూరు ఎంపీలు సైతం ఎమ్‌ఎల్‌ఏలుగా అసెంబ్లీ స్థానాలకు రేసులో నిలుస్తామని, ఎంపీలుగా తమ పేరును పరిశీలనలోకి తీసుకోవద్దని సూచిస్తున్నారట..
కేవలం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు మాత్రమే తాము పోటీలు ఉంటామని సంకేతాలు పంపుతున్నారు.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజం పేట ఎంపీ మిధున్ రెడ్డి ఈ రేసులో ఉన్నారని తెలుస్తోంది.. ఈ ముగ్గురు మినహా మిగిలిన 19 మంది.. తమను ఎంపీ అభ్యర్ధిగా కాకుండా ఎమ్‌ఎల్‌ఏ స్థానాల్లో అయితేనే తమ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నారట.. ఓటమి భయమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. 19 మంది ఎంపీలు రివర్స్ గేర్ వేయడంతో వైసీపీ హైకమాండ్ డైలమాలో పడిపోయిందని సమాచారం.. నిజంగా ఇంతటి వ్యతిరేకత ఉందా.?? అని ఆత్మపరిశీలనలో ఉందట.. మరి, రాబోయే రోజుల్లో ఈ సమస్యని జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి..