పైకి మౌనంగా ఉన్నా..ఎవరూ మీడియా ముందుకు రాకపోయినా.. వైసీపీలోని సీనియర్ నేతల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కొందరు ఈ విషయంపై మీడియా మిత్రులకు లీకులు కూడా ఇవ్వడం వెనుక విషయాన్ని బహిర్గతం చేయడమే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. సరే! ఇంతకీ విషయంలోకి వెళ్తే.. వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్న మాట.. మా వాళ్లు ఓటి ఎంపీలే ! మా వోళ్లకన్నా కూడా టీడీపీ ఎంపీలే బెటర్! అని. ఇది ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, దీనికి వారు ఇచ్చిన వివరణ చూస్తే నిజమేనని అనిపిస్తోంది. వైసీపీ తరఫున గత ఏడాది ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలుపు గుర్రం ఎక్కారు.
సమస్యలపై లేదు దృష్టి
వీరిలో ఒకరు హఠాన్మరణం చెందినా ప్రస్తుతం 21 మంది ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఏపీ గురించి స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు? పోనీ.. తన నియోజకవర్గాల్లోని సమస్యలపై ఎవరు దృష్టి పెడుతున్నారు? అనే అంశాల్లో అందరూ వీక్‌గానే ఉన్నారని అంటున్నారు వైసీపీ సీనియర్లు. కొందరు తమ నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటే, మరికొందరు నియోజకవర్గంలోనే ఉంటూ కూడా అభివృద్ధిని విస్మరిస్తున్నారట. ఇకొందరు.. తమ సొంత బ్రెయిన్ వాడడం ఎప్పుడో మరిచిపోయారని అంటున్నారు.
అంతా ఆయన కనుసన్నల్లోనే..
ఇక, నలుగురు ఎంపీలు.. తమ నియోజకవర్గాలను వదిలేసి పక్క నియోజకవర్గాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్న విషయాన్ని సీనియర్లు వెల్లడిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనూ ఇవీ.. మా సమస్యలు.. వీటిపై చర్చించేందుకు అవకాశం కోరదాం! అని ఎంపీలు ఎవరూ కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. అంతా కూడా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో , ఆయన ఏం చెబితే దానికి తలూపుతున్నారని చెబుతున్నారు. దీనివల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి మాట ఎలా ఉన్నా, ఎంపీలు తమ స్వతంత్రతను కోల్పోతున్నారని, ఇది మున్ముందు వారికే ఇబ్బందికర పరిణామమని అంటున్నారు.
ఒకే ఒక్కడు
ఆ పార్టీ లో నర్సాపురం ఎంపీ రఘరాంకృష్ణంరాజు ఒక్కడే వైసీపీ విధానాలపై స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా అనేక హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా నిత్యం మీడియాతో మాట్లాడుతూ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. బహిష్కరణ వేటు పడుతుందన్న వార్తలు వస్తున్నా ఆయన పట్టించుకోవటం లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల అండతోనే సొంత పార్టీపై ఆయన నిప్పులు చెరుగుతున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఏది ఏమైనా వైసీపీలో తాను సర్వ స్వతంత్రుడు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
అడగాలని ఉన్నా భయం..
వాస్తవానికి వైసీపీ ఎంపీల్లో చాలా మందికి ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలనే ఉంది. ఎన్నికల్లో ఈ నినాదమే తాము వినిపించాం కాబట్టి దీనిని ప్రశ్నిస్తామని వారి లోలోనే చర్చించుకుంటున్నారు. కానీ, బైటకి మాత్రం నోరు మెదపలేకపోతున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన విషయాలతో పాటు నియోజకవర్గంలోని అంశాలపైనా అవగాహన, అడగాలనే ఉత్సాహం ఉన్నా సాయిరెడ్డి ఆగ్రహానికి గురవుతామేమోనని భయపడుతున్నారు. కానీ, ఈ పరిస్థితి టీడీపీలో లేదని అంటున్నారు.
స్వతంత్రంగా వారు పోరాటం
టీడీపీ ఎంపీలు ముగ్గురే ఉన్నా, స్వతంత్రంగా ఉన్నారని..శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రైల్వే జోన్ కోసం స్వతంత్రంగా పోరాడుతున్న విషయాన్ని వైసీపీ నేతలే ఉటంకిస్తున్నారు. ఇక, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా తాను ఎంచుకున్న అంశంపై స్పష్టంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం వైసీపీలో కనిపించడం లేదని సీనియర్లు చెబుతున్నారు. అయితే, వీరు ఎక్కడా బయట పడకపోవడం గమనించాల్సిన ప్రధాన విషయం.. ఇదీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి!!