నటరత్న నందమూరి తారక రామారావు- ఈ పేరు చెబితే తెలుగు తల్లి మురిసిపోతుంది… తెలుగునేల పరవశిస్తుంది. తెలుగు గడ్డపై నటుడిగా ఓ వెలుగు వెలిగి… తిరిగి అదే నేలను ఏలిన మహనీయుడాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన సేవలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చారు.
ఆయన పుట్టి పెరిగిన జిల్లాకి కూడా ఆయన పేరు దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగు దేశం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో 2014లోనే తెలుగు దేశం ప్రభుత్వం అక్కడి పాఠ్యాంశాల్లోనూ ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రవేశపెట్టింది. అదంతా ఒక ఎత్తయితే ఆయన వీరాభిమానిగా మరో వ్యక్తి ఆయనకు సమర్పించిన అక్షరనీరాజనం ఇంకో ఎత్తు. ఇంతకీ ఎవరా అభిమాని అనుకుంటున్నారా. అతనే ప్రముఖ సినీ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి. తన సినిమా టైటిల్స్ లోనే ‘నా పరిపూర్ణ, పరిశుద్ధ హృదయంతో, నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడూ, ప్రభూ.. ఈ జన్మకూ..’ అంటూ తలచుకుంటుంటారాయన.
‘మరణంలేని జననం ఆయనిది,
అలుపెరగని గమనం ఆయనిది,
అంతేలేని పయనం ఆయనిది..’
ఆయనే.. ఆయనే.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, కళాప్రపూర్ణ, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే ‘అన్న’, అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’ఆయన దివ్యమోహన రూపం సినిమాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్ఫూర్తి నిచ్చింది, తిరిగి ఆ రూపమే రాజకీయాల్లో తాను ప్రవేశపెట్టిన సంచలన, సంక్షేమ పథకాల ద్వారా జనాకర్షణలో, మరెందరో రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా నిలిచింది.
‘ఇండియా’లోని ఓ ‘రిక్షాపుల్లర్’ నుండి ‘అమెరికా’లోని ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల’ వరకూ కుల, మత, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా, వివిధ రంగాలలో ఉన్న చాలా మందికి, ‘ఆయన’ తన రూపం ద్వారా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారు, తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా ఇంకెంతో ఉద్వేగాన్ని నింపారు అంటూ వైవిఎస్ చౌదరి అక్షరాభిషేకం చేశారు. తెలంగాణ 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చి భావితరాల్లో స్ఫూర్తిమంతమైన చైతన్యాన్ని నింపే ప్రక్రియకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కొనియాడారు వైవిఎస్ చౌదరి.











