తల్లి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెడితే… పిల్ల బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెడుతోందన్నమాట. ఈ మాట ఎవరి గురించి అంటే అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించే. ఈ భామ బాలీవుడ్ లో ‘దడక్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’లో నటించింది. తాజా విషయం ఏమిటంటే జాన్వీ ఓ తెలుగు సినిమాని అంగీకరించిందట. అయితే ఆమె జతకట్టేది ఎవరితోనో కాదు జూనియర్ ఎన్టీఆర్ తో. తాత ఎన్టీఆర్ జాన్వీ తల్లితో ‘ఆకు చాటు పిందె తడిసె’ అని సందడి చేస్తే, ఈ మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ అతిలోక సుందరితోనే స్టెప్పులేయబోతున్నాడట.

టాలీవుడ్ లో ఇప్పుడీ మాట వైరల్ గా ఉంది. అందంలోనూ, నటనలోనూ ఈమె తల్లితో పోటీపడుతుందో లేదోగాని తన ప్రతిభను నిరూపించుకోడానికి మాత్రం ఇదే మంచి అవకాశం. తల్లిని ఆదరించిన తెలుగు ప్రజలు ఈ పిల్లను మన తెలుగమ్మాయే అని ఆదరిస్తారో లేదో తెలియాలి. ఇంతకీ ఆ తెలుగు సినిమా దర్శకుడు ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అట. ఈ సినిమాకు సంబంధించి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిమీద ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
మరో పక్క యంగ్ టైగర్ ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్రారంభమైతే ఈ వ్యవహారం కొలిక్కి రావచ్చు. మొత్తానికి ఎన్టీఆర్, జాన్వీ కాంబినేషన్ ఆలోచన మాత్రం భలేగా ఉంది కదూ. తాతా మనవళ్లు, తల్లీ కూతుళ్లు… అరుదుగా వచ్చే అవకాశం ఇది. ఇందులో నాటి ఎన్టీఆర్, శ్రీదేవిల పాటను కూడా రీమిక్స్ చేస్తే థియేటర్లో ఈలల గోలేనేమో.











