(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం రామతీర్థం ధర్మయాత్రకు భాజపా – జనసేన సంయుక్తంగా పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ధర్మయాత్ర కోసం అక్కడికి చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితర ఆపార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట, తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సోము వీర్రాజుతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
నేతలు సహకరించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు, రాజకీయపార్టీ నేతలు సహకరించాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎల్. కాళిదాసు రంగారావు ఒక ప్రకటనలో కోరారు. రాజకీయ పార్టీల నాయకులు మతసామరస్యాన్ని కాపాడాలని, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించ వద్దని హితవు పలికారు. విగ్రహం ధ్వంస ఘటన దర్యాప్తులో ఉందని, రాజకీయనేతల పర్యటన దర్యాప్తునకు అడ్డంకిగా మారుతున్నాయని, మతం పేరున ప్రదర్శనలు, ధర్నాలు, సభలు ప్రజలను అశాంతికి గురి చేసి సమాజంలో చీలికలు తెచ్చే అవకాశం వుందని పేర్కొన్నారు.
Must Read ;- సొమ్మసిల్లిన సోము వీర్రాజు.. రామతీర్థంలో మరోమారు ఉద్రిక్తత










