ప్రభుత్వం మారడం అమరావతి రైతులకు శాపంగా మారిందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అవుననిపిస్తోంది. రాష్ట్ర రాజధానికి తమ విలువైన భూములు ఇచ్చిన రైతుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది. అమరావతి రైతుల దింపుడు కళ్లెం ఆశలకు కూడా కేంద్రం తిలోదకాలు ఇచ్చేసింది. మూడు రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని కేంద్రం ఏపీ హైకోర్టుకు మరోమారు తెలిపింది. ఇప్పటికే కోర్టుకిచ్చిన తమ అఫిడవిట్ లో రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్రాలదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి స్పందించిన కేంద్రం రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. దీంతో భూములు ఇచ్చిన రైతుల వేదన వర్ణనాతీతం. రైతుల ఇచ్చిన భూమి విషయంలో కూడా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదుల్లో కలిసేందుకు అనుమతి కోరుతూ త్వరలో రాష్ట్రపతికి లేఖ వ్రాయాలని వారు నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ నేతల అధికార మదంతో ఈస్ట్ గోదావరి జిల్లాలో శిరోముండనం కేసు నమోదయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యాయం జరగకపోవడంతో ఆ వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం వెంటనే స్పందించి ఆ కేసును సామాజిక న్యాయ శాఖను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి నుంచి ఏ న్యామమైన జరుగుతుందా? అనే ఆశతో రైతులు ఆశలు పెట్టుకున్నారు. కానీ గొప్ప ఆశయంతో భూములు ఇచ్చిన వారిని రాష్ట్రం, కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని నిపుణులు చెబుతున్నారు.










