తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో నాణ్యమైన సేవలను అందిస్తున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక (క్రైం రిపోర్టు)ను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి పలు అంశాలను వెల్లడించారు. పోలీసుల పనితనంలో మెరుగైన సేవలను అందించడానికి కొత్తదనం తెస్తూనే వున్నామని ఆయన అన్నారు. పోలీసుశాఖ డయల్ 100, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే వుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
తెలంగాణ పోలీసు వ్యవస్థలో అధునాతన టెక్నాలజీని ఉపయోగంలోకి తీసుకువచ్చామని, అలాగే నేర రహిత, మావోయిస్టు రహిత తెలంగాణగా తయారు చేసేదిశగా పోలీసు వ్యవస్థ ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న మావోయిస్టులు తెలంగాణలోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తే వారిని పోలీసులు అడ్డుకున్నారని, గత ఏడాదిలో 11 మంది నక్సలైట్లు మృతి చెందగా, మరో 135 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మావోయిస్టుల నుండి 22 తుపాకులను, 23 లక్షల వరకు నగదును రికవరీ చేశామని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి తెలిపారు.
కరోనా సమయంలో రాష్ట్రంలో వేడుకలు, అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు. 2019వ సంవత్సరంతో పోలిస్తే 2020లో క్రైమ్ రేటు 6శాతం తగ్గిందని ఆయన అన్నారు.
కరోనా కాలంలో పోలీసుల సేవలు మరువలేనివని ఈ సందర్భంగా డీజీపీ గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మేలైన సేవల కోసం తాము చర్యలు తీసుకున్నామని, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా ప్రజలకు తాము చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నేరస్తులు తెలంగాణలో ఏదైనా నేరం చేస్తే దొరికిపోతాం అనే విధంగా పోలీసింగ్ ను చేపట్టామని ఆయన సగర్వంగా తెలిపారు. కొవిడ్ వ్యాధి వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలకు అవసరమైన అన్ని సేవలను పోలీసు శాఖ అందించిందని, రాష్ట్రంలో మావోయిస్టులను కూడా విజయవంతంగా ఎదుర్కొన్నామని డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్టుల ప్రణాళికలను సమష్టి కృషితోనే ప్రతిఘటించామని ఆయన తెలిపారు.
ఏడాది పూర్తవుతున్న నేపధ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పోలీసులు తమ శక్తి వంచన లేకుండా పనిచేశారని ఆయన ప్రశంసించారు. గత ఏడాది కాలంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు బాగా తగ్గిందని, గత సంవత్సర కాలంలో మహిళలు, పిల్లల భద్రతకు పోలీసు శాఖ పెద్దపీట వేసిందని, 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎన్ కౌంటర్లు జరిగాయని, అందులో 11మంది మావోయిస్టులు మృతిచెందారని ఆయన వెల్లడించారు. 135మంది మావోయిస్టులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో జరిగిన చోరీల్లో 54శాతం రికవరీ చేశామని, మహిళలపై జరిగే వేధింపులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.92శాతం తగ్గిందని, అలాగే హత్యలు 8.29శాతం, దోపిడీలు 28.57శాతం, చోరీలు 33.11 శాతం, చైన్ స్నాచింగ్ లు 46 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. గత ఏడాది కన్విక్షన్ రేటు 29.4 శాతం వుంటే ఈ ఏడాది అది 48.5 శాతానికి పెరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ఏడాది 13.93 శాతం తగ్గాయని, ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు 9శాతం వరకు తగ్గాయని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2020లో 99,095 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 4490 కేసులను ఛేదించామని తెలిపారు. జీరో ఫైర్ కింద 624 కేసులు నమోదు చేశామని, పిడి యాక్ట్ కింద 350 మంది జైలుకి పంపించడం జరిగిందని తెలిపారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ కు 4855 ఫిర్యాదులు అందాయని, 567 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. 2020లో చేసిన కొన్ని నేరాల్లోని నేరస్తులకు నలుగురికి మరణశిక్ష పడేలా చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు వుండగా, 30 జిల్లాల్లో మావోల కదలికలు లేకుండా చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదిలో పోలీసుల ముందు 45మంది మావోయిస్టులు లొంగిపోయారని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 150922 కేసులు నమోదయ్యాయని, డయల్ 100 ద్వారా 12 లక్షల 24 వేల కాల్స్ వచ్చాయని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులు 1934 నమోదయ్యాయని, మర్డర్ లు 660, కిడ్నాప్ లు 1033 గా నమోదయ్యాయని ఆయన తెలిపారు. 93 కోట్ల 73లక్షల సొమ్ము చోరీకి గురికాగా అందులో 50 కోట్ల 47 లక్షలు రికవరీ చేశామని ఆయన తెలిపారు.
ఈ ఏడాది 6544 వరకట్న వేధింపుల కేసులు నమోదు కాగా అందులో 144 మంది మృతి చెందినట్లు తెలిపారు. 2020లో 383మందిని రెస్క్యూ చేశామని, మానవ అక్రమ రవాణా చేస్తున్న 522 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
ఆపరేషన్ స్మైల్
ఆపరేషన్ స్మైల్ ద్వారా సుమారు 3274 మంది పిల్లలను రెస్క్యూ చేశామని మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మిస్సింగ్ అయిన సుమారు 741మంది పిల్లలను గుర్తించి రెస్యూ చేశామని తెలిపారు. ఈ ఏడాది ఎస్.సి, ఎస్.టి కేసులు 2096 కేసులు నమోదయ్యాయని, గతఏడాదితోపోలిస్తే ఈ ఏడాది ఇవి 10.89శాతం పెరిగినట్టు తెలిపారు. రాచకొండ, సైబరాబాద్ పరిసరాల్లో ఏవిధంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నామో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కమిషనరేట్, జిల్లాలో టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపు చేస్తున్నామని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6968 ఆర్ధిక నేరాలు నమోదు అయ్యాయని, అలాగే 4544 సైబర్ క్రైమ్ కు సంబంధించిన నేరాలు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 103 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16866 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందులో 5821మంది చనిపోయారని, అలాగే ట్రాఫిక్ ఉల్లంఘన కింద 613 కోట్ల జరిమానాలు వాహన దారులపై విధించామని, మోటారు వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక కోటీ 67 లక్షలు కేసులు నమోదు అయ్యాయని, సుమారు 4.5లక్షల మందికి పాస్ పోర్టు వెరిఫికేషన్ జరిగిందని ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు.











