(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విజయనగరం – విశాఖపట్నం జాతీయ రహదారిపై విజయనగరం మండలం సుంకరిపేట వద్ద ఎదురెదుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీ కొన్నాయి. పాలకొండ నుండి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు తన ముందు వెళ్తున్న గ్యాస్ లారీని ఓవర్ టేక్ చేయబోయి .. ఎదురుగా విశాఖ నుండి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొంది. ఇదే తరుణంలో గ్యాస్ లారీ తనను ఓవర్ టేక్ చేసిన ఆర్టీసీ బస్సును వెనుక నుండి బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో ఇరువురు ఆర్టీసి డ్రైవర్లు, ఒక ప్రయాణికుడు (45 ఏళ్లు) అక్కడికక్కడే మృతిచెందారు. సుమారు 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు పంపించారు. సంఘటనాస్థలానికి హుటాహుటిన స్థానికులు, చింతపల్లి 5వ బెటాలియన్ పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి సహకరించారు. విజయనగరంజిల్లా ఎస్పీ రాజకుమారి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి. రంగారావు, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి మజ్జి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకుని సరైన చికిత్స అందజేయాలని వైద్యులకు సూచించారు.
Must Read ;- స్ట్రెచర్ పై శ్మశానానికి వచ్చి.. భార్యకు కడసారి వీడ్కోలు పలికి..!











