‘ఊహకందనిది జీవితం’ అంటుంటారు పెద్దలు. మనం ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలుస్తాడన్నట్లు.. రోజు ముందు వరకు పుట్టబోయే బిడ్డ గురించి ఊహించుకుంటూ.. ఆనందంగా గడిపిన ఆ దంపతుల జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చి.. భార్య, ఆమె కడుపులోని బిడ్డను మింగేయగా.. అనాథలా మారిన ఆ భర్త.. తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. భార్య అంత్యక్రియలు నిర్వహించేందుకు చివరికి స్ట్రెచర్ పై రావలసి వచ్చింది.
చితిపై భార్య, స్ర్టెచర్‌పై భర్తను చూసిన స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన బాకారం కుమ్మరివాడిలో తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాయత్ నగర్ వై జంక్షన్ లో ఆర్టీసీ బస్సు ఢీ కొని బుధవారం గర్భిణి మృతి చెందిన విషయం తెలిసిందే. ఉప్పల్‌కు చెందిన షాలినీకి బాకారానికి చెందిన సతీశ్ గౌడ్ కు 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఐదేళ్ల తర్వాత సహస్ర జన్మించింది. షాలిని ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో భర్త సతీశ్ గౌడ్ కాలు విరిగింది. అతడు హిమాయత్ నగర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం సాయంత్రం బాకారంలోని శ్మశాన వాటికలో షాలిని అంత్యక్రియలు జరిగాయి. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో వచ్చి స్ర్టెచర్ పై పడుకుని భార్యను కడసారి చూసుకున్నాడు. మరోవైపు ఏడాదిన్నర కుమార్తెను చూస్తూ సతీశ్ గౌడ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సన్నివేశం చూపరులను కలిచివేసింది. అంత్యక్రియల అనంతరం సతీశ్ గౌడ్ ను తిరిగి ఆసుపత్రికి తరలించారు.
Must Read ;- రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయిన బాధితుడిగా వచ్చాను











