
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకులు చాలా మంది రాజకీయ నిరుద్యోగులుగానే కొనసాగుతుండటం , సరైన పదవులు దక్కకపోవడంతో క్రమక్రమంగా గూడు కట్టుకుం టున్నఅసంతృప్తిని తొలగించేందుకు ఆ పార్టీ ముమ్మరంగా కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో 56 కార్పొరేషన్ల ఛైర్మన్ల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రూపొందించింది. ఈ జాబితాను ఆధికారికంగా ప్రకటించనప్పటికీ, అనధికారికంగా సోషల్ మీడియా ద్వారా బహిర్గతపరిచింది. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితానే ఆధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జాబితాపై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఆయా కార్పొరేషన్లకు ఛైర్మెన్లను నియమించిన వ్యక్తులు ఏ సామాజిక వర్గానికి చెందినవారో , ఆ వర్గ ప్రజలకు కనీస ముఖ పరిచయం లేని వ్యక్తులు కావడం, ఏ ప్రాంతం స్థానికతతో వారిని ప్రతిపాదించారో వారు ఆ ప్రాంతవాసులు కాకపోవడం… తదితర కారణాల వల్ల మొదలైన అనిశ్చితి అసమ్మతిగా రాజుకుంటోంది.
జెండా మోసిన వారెక్కడా..?

వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీనే నమ్ముకొని , ఆ జెండానే తమ అజెండాగా మార్చుకుని పార్టీ విజయానికి నిరంతరం కృషి చేసిన ద్వితీయ శ్రేణినాయకులు ప్రభుత్వం ఏర్పాటయ్యాక కార్పొరేషన్ పదవులపై కొండంత ఆశలు పెంచుకున్నారు. అందుకోసం చాలా విధాలుగా ప్రయత్నించారు కూడా.
ఇంతవరకు ఆశతో నిరీక్షిస్తున్నవారు… జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో బాహటంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స అనుచరుడు పిళ్లా విజయకుమార్ తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఆశించారు. దాదాపు కన్ఫర్మ్ గా భావించారు. చివరికి జాబితాలో ఇదే జిల్లాకు చెందిన మామిడి శ్రీకాంత్ పేరు కనిపించడంతో పిళ్లా అనుచరులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
అంతా సీల్డుకవర్ల వ్యవహారమే…

కార్పొరేషన్ ఛైర్మన్ నియామకాలన్నీ సీల్డుకవర్ల వ్యవహారంలా ఉందని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి విజయానికి కృషి చేసినవారిని విస్మరించి, అగ్రశ్రేణి నాయకులను ప్రసన్నం చేసుకున్నవారి పేర్లున్న జాబితా సీల్డుకవర్లలో అధిష్ఠానానికి చేరినట్లు, వారికే ప్రాధాన్యమిచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శిష్టికరణ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా విజయనగరం కోటా నుంచి నియమితులైన కనిమంతి అనూష పట్నాయక్ ఈ జిల్లా వారు కాదని, ఆమె విశాఖలో ఉంటున్నారని తెలుస్తోంది. మరి ఆమెను ఏ ప్రాతిపదికన విజయనగరం కోటాలో నియమించారో అంతుపట్టడంలేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమెకు ఈ జిల్లా వాసులతో సంబంధాలేమీ లేవని శిష్టికరణ సంఘాలు అంటున్నాయి.
మేం విజయనగర వాసులమే…

లియో న్యూస్. కామ్ ఆమెతో సంప్రదించగా తాము విజయనగర జిల్లా వాసులమేనని , తాతముత్తాతల నుంచి ఇక్కడవాళ్లమేనని , ఉద్యోగ ఉపాధి రీత్యా బయట వెళ్లామంతే అన్నారు. అలాగే ఈ జిల్లా కోటాలో దాసరి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమితులైన డాక్టర్ రంగముద్రి రమాదేవిపై కూడా ఆ సామాజిక వర్గ ప్రజల నుంచి అసమ్మతి వ్యక్తమవుతోంది. ఈ విషయం ఆమెతో ప్రస్తావించగా అలాంటిదేమీ లేదన్నారు.
అనధికారికంగా లీక్ అయిన జాబితా పార్టీ లో చిచ్చు రేపుతున్నందున, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం ఈ జాబితా ప్రకారం యథాతథంగా వైసీపీ ప్రభుత్వం చేపడుతుందా , అసమ్మతిని తగ్గించేందుకు ఏవైనా మార్పులు, చేర్పులు చేస్తుందా అనేది వేచిచూడాలి.











