రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వసాధారణమే. అయితే కొంత మంది సవాల్‌ను స్వీకరిస్తే.. మరికొంత మంది వాటిని దాటవేస్తారు. ఇలాంటిదే ఒకటి ఆసక్తికరమైన ఘటన దుబ్బాక ఎన్నికల ప్రచార నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మధ్య చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నకల ప్రచారంలో ఈరోజు పాల్గొన్న హరీష్.. పెన్షన్లపై చర్చకు బండి సంజయ్‌కు బస్టాండ్‌కు రమ్మన్న.. ఇప్పటి వరకు పత్తాలేడన్నారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీడీ కార్మికులకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీ, తెలంగాణలో మాత్రం తామే ఇస్తున్నట్లు చెప్పుకోవడం గోబెల్స్ ప్రచారంలో భాగమేనని మంత్రి విమర్శించారు.
బండి.. బస్టాండ్‌కు వస్తవా?..
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈక్రమంలో నిన్న ప్రచారంలో బండి సంజయ్ చేసిన విమర్శలకు మంత్రి హరీష్ బదులిస్తూ ఇలా స్పందించారు. తెలంగాణలో బీడి కార్మికులకు పెన్షన్లను ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై చర్చకు బండి సంజయ్ సిద్ధిపేట పాత బస్టాండ్‌కు రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇది నిజమని నిరూపిస్తే తన మంత్రి పదవికి, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ బండి సంజయ్ చెప్పింది తప్పని తేలితే.. ఎంపీ పదవికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీకి తాను రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అయితే ఈ అంశంపై దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఈ రోజు హరీష్‌రావు స్పందించి మాట్లాడారు. బస్టాండ్‌కు రమ్మన్నా.. బండి సంజయ్ రాలేదని, పత్తాలేకుండా పోయారని విమర్శించారు.
గోబెల్స్ ప్రచారం..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని హరీష్ తెలిపారు. మోడీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఈ ఆరేళ్లలో ఎంత మందికి కొలువులు ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మీటర్లు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కాలిపోయే మోటార్లు అని ఎద్దేవా చేశారు. వానా కాలం పంటకు రైతు బంధును టీఆర్ఎస్ ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇచ్చిందా అని మంత్రి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఇదే స్థాయిలో బండి సంజయ్ కూడా తెరాస ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. మొత్తంగా దుబ్బాక.. ఎన్నికల రణరంగంగా మారింది.











