బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి ముందు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. గోషామహాల్ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడంలో రాజాసింగ్ విఫలమయ్యాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాగే వరద సహాయం అందజేయడంలో తన వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ గోషామహాల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో రాజాసింగ్ ఇంటి ముందు దాదాపు వంద మంది పోలీసులు మొహరించినట్లు తెలిసింది. ఇంటి ముందు నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసు బలగాలు మొహరించాయి. అయితే కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. వరద సాయం అందజేస్తున్నది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఎక్కువ. ప్రతి పక్ష పార్టీ నియోజకవర్గాల్లోనూ వారే సాయాన్ని అందజేస్తున్న పరిస్థితి ఉంది. మరీ అలాంటిది తమకు వరద సాయం అందడంలేదని అధికార పార్టీ నేతలను వదిలేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటిని ముట్టడిస్తే ఏమొస్తుంది? అనే చర్చ జరుగుతోంది.
ఓట్ల కోసమే ఇంటికి రూ.10వేలు..
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరద సాయం అందజేయటంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల సాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకే పంచుతున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల ఓట్ల కోసమే ఇంటికి రూ.10వేలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అవి కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే చేరుతున్నాయని మండిపడ్డారు. డబ్బులు తీసుకుని టీఆర్ఎస్‌కు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొద్దని ఆయన కోరారు.
ఇదెక్కడి లొల్లి…
ప్రభుత్వం వరద సాయాన్ని ప్రకటించింది. దాన్ని బాధితులకు అందజేసేలా దాదాపు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులే బస్తీల్లో పంచుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడా కూడా కానరావడం లేదు. అనర్హులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకే పెద్ద ఎత్తున సహాయం చేరుతుందనే విమర్శలను రాజాసింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇచ్చేది ప్రభుత్వం, పంచేది అధికార పార్టీకి చెందిన నేతలు మధ్యలో ప్రతిపక్ష పార్టీ నేత అయిన రాజాసింగ్‌ను ఎందుకు లాగుతున్నారనేది బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడి చేయకుండా తన ఇంటిని ముట్టడి చేస్తే ఏమొస్తుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాజాసింగ్ పేర్కొంటున్నారు.











