ఏపీలో వరుసగా శిరోముండనం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటన మరచిపోకముందే బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన అమానవీయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకుడికి గుండు కొట్టించిన ఘటన చోటు చేసుకొంది. బాధితుడు తనకు జరిగిన ఈ అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా నూతన్ నాయుడు తమ వివరణలో ‘నూతన’ కోణాన్ని ఆవిష్కరించాడు. ఆ బాధితుడే తనకు గుండు కొట్టించమని చెప్పడమే గాక క్షురకుడిని పిలిపించాడని నూతన్ నాయుడు వెల్లడించారు.
శ్రీకాకుళానికి చెందిన శ్రీకాంత్ ఉపాధి కోసం వైజాగ్ లోని నూతన్ నాయుడు ఇంట్లో పనికి కుదిరారు. నాలుగు నెలల క్రితం పనిలో చేరిన శ్రీకాంత్ ఆగస్ట్ 1 నుంచి పని మానేశాడు. దాదాపు 25 రోజుల తరువాత నూతన్ నాయుడు భార్య పోయిన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని శ్రీకాంత్ ను ఇంటికి పిలిచారు. ఆ మరుసటి రోజు కూడా మరోమారు శ్రీకాంత్ ను రమ్మని సెల్ ఫోన్ గురించి ఆరా తీశారు. తాను ఫోన్ తీయలేదని శ్రీకాంత్ గట్టిగా చెప్పడంతో కోపంతో ఊగిపోయిన వారు క్షురకుడిని పిలిపించి శిరోముండనం చేయించడమే కాక దాడి చేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించి శ్రీకాంత్ ను వదిలివేశారు. తనకు జరిగిన ఈ దారుణాన్ని శ్రీకాంత్ మీడియాకు తెలియచేశాడు. శ్రీకాంత్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమస్య తీవ్రంగా మారడంతో నూతన్ నాయుడు ఈ కేసులో సరికొత్త కోణాన్ని మీడియాకు తెలియచేశాడు.
శ్రీకాంత్ తో బాటు ఓ యువతీ తమ ఇంట్లో పని చేసేదని నూతన్ నాయుడు తెలిపాడు. ఆ యువతి చిత్రాలను సెల్ ఫోన్ లో బంధించిన శ్రీకాంత్ ఆమెను ఇబ్బంది పెట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఎన్ని మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో ఉద్యోగంలోనుంచి తీసివేశామని వెల్లడించారు. ఉద్యోగం మానివేసిన తరువాత కూడా శ్రీకాంత్ లో ఎటువంటి మార్పురాలేదని ఆ యువతిని పదే పదే వేధించేవాడని తెలిపాడు. పోలీసులకు పట్టిస్తామని హెచ్చరించడంతో భయపడి పోయిన శ్రీకాంత్ చేసిన తప్పుకు శిక్షగా గుండు కొట్టించాలని అడిగాడని నూతన్ నాయుడు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. నూతన్ నాయుడు ఇలాంటి ఘటనకు దిగి ఉంటాడని కొందరు అంటున్నారు. ఏదయినా అనుకుంటే అది జరిగేంతవరకు ఆయన ఒప్పుకోడని తెలిసిన వాళ్ళు అంటున్నారు.
ఇందుకు ఉదాహరణగా చెప్పాలంటే బిగ్ బాస్-2 లో బయటికి వచ్చిన నూతన్ నాయుడు తిరిగి హౌస్ లోకి రావాలనే ఉద్దేశంతో భారీగా ఖర్చు చేశారనే వార్తలు రావడం ఒక విషయమైతే మరో విషయం తనకు ఇష్టమైన హీరో & నాయకుడు పవన్ కళ్యాణ్ ను ఎవరేమైనా అంటే అసలు భరించలేని తత్వం ఆయనదని తెలిసింది. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి పరాన్నజీవి అంటూ సినిమా తీసిన నూతన్ నాయుడుది ఒక పెక్యులర్ మెంటాలిటీ అంటూ ఆయన నడిపే యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే వారు కూడా చెప్పడం గమనార్హం. దళిత యువకుడికి గుండు కొట్టించడమే కాకుండా నూతన్ నాయుడు అబద్దాలు చెబుతున్నాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. జనసేన నాయకులు ఓ అడుగు ముందుకేసి వైసీపీ ప్రభుత్వం జనసేన నాయకుడిని టార్గెట్ చేసిందని విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడు? అనే ఆసక్తి నెలకొంది. ఈస్ట్ గోదావరిలో జరిగిన ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్ నూతన్ నాయడు ఘటనపై ఏం చర్యలు తీసుకోనున్నాడో చూడాలి..!











