‘రాంబో’పేరు వినగానే మనకు వెంటనే హాలీవుడ్ కండలవీరుడు సిల్వెస్టర్ స్టాలోన్ గుర్తుకు వచ్చేస్తారు. 1980వ దశకంలో వచ్చిన ఈ సినిమాను మళ్లీ హిందీలో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. స్టాలోన్ 1970లోనే అనేక సినిమాలు చేసినా రాంబో సిరీస్ కు వచ్చిన పేరు మరి దేనికీ రాలేదు. బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ తనయుడిని బాలీవుడ్ రాంబో అంటుంటారు. స్టాలోన్ మాదిరిగా కండలు ఉంటాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. రాంబో సినిమాని టైగర్ తోనే తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంతకీ తీయబోయేది ఏ రాంబో అనేది ఓ ప్రశ్న. ఎందుకంటే రాంబో సిరీస్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఫస్ట్ బ్లడ్’ పేరుతో వచ్చిన స్టాలోన్ రాంబో సిరీస్ చేసేలా చేసింది. ఒక విధంగా ఈ సినిమా మెగాస్టార్ ‘ఖైదీ’ సినిమాకి ప్రేరణ కూడా. ఖైదీ సినిమా ప్రారంభ సన్నివేశాన్ని యథాతథంగా దించేశారు. అప్పట్లో అది చెల్లుబాటైంది. చిరంజీవికి ఈ సినిమా స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఫస్ట్ బ్లడ్ తర్వాత రాంబో తెరకెక్కింది. ఇప్పుడు తీయబోయేది ఏది అనే దాంట్లో స్పష్టత లేదు.
ఇంతకుముందు ఈ సినిమాని హృతిక్ రోషన్ తో నిర్మించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇందులో నటించడానికి హృతిక్ ఇష్టం చూపకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత టైగర్ పేరు తెరపైకి వచ్చింది. నిజానికి 2018-19లోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. సిద్ధార్ధ ఆనంద్ ను దర్శకుడిగా అనుకున్నారు. ప్రస్తుతం దర్శకుడి పేరు కూడా మారిపోయింది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఈ రాంబో తెరకెక్కబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట.
ప్రస్తుతం రోహిత్ ధావన్ తెలుగు విజయవంతమైన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే పనిలో ఉన్నారు. అది పూర్తికాగానే రాంబో సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. టైగర్ ష్రాఫ్ కూడా సీక్వెల్ అలవాటు ఉంది కాబట్టి రాంబో సిరీస్ అన్నిటినీ తెరకెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.










