మన ఇస్రో ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసింది. ప్రపంచాన్ని అబ్బురపరచేలా ఎన్నో ప్రయోగాలను తొలి అడుగులోనే విజయవంతం చేసిన గాధలు ఎన్నో. అలాంటి ఇస్రో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. అందుకోసం ఈ ఏడాది మొదటగా ప్రయోగించబోతున్న తొలి అంతరిక్ష ప్రయోగాన్నే వేదికగా మార్చుకుంది. మన దేశ ప్రధాని ఫొటో, భగవద్గీత కాపీ, 25 వేల మంది పౌరులు పేర్లు కూడా ఇందులో ఉంచనుంది.
పీఎస్‌ఎల్‌వీ సీ-51 వాహకనౌకను, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10:24 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో పాటు దేశీయ ప్రైవేటు సంస్థలు రూపొందించిన ‘ఆనంద్’, ‘సతీశ్ ధావన్’, ‘యునిటీశాట్’ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. ఇందులోని దేశీయ ఉపగ్రహాలైన ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్ రూపొందించగా, ‘సతీశ్ ధావన్’ను చెన్నైకు చెందిన ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’, ‘యునిటీశాట్’ను జిట్‌శాట్(శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించడం విశేషం.
సతీశ్ ధావన్‌ను రూపొందించిన స్పేస్ కిడ్జ్ వారి మొదట ఉపగ్రహం కావడం చేత.. దానికి ప్రత్యేకత తీసుకురావాలని భావించిన సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే.. తమ ఉపగ్రహానికి ప్రముఖ భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ పేరును పెట్టడంతోపాటు, ఉపగ్రహంలో మోడీ చిత్రపటం, భగవద్గీత, 25 వేల పౌరుల పేర్లు పంపనున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో కూడా విదేశీయులు తమ ప్రయోగాల్లో భాగంగా బైబిల్‌ని పంపిన దాఖలాలున్నాయి.
Must Read ;- నాది ‘మార్స్’.. భూగ్రహవాసులను కాపాడడానికి వచ్చాను!











