పంతం వీడి పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.ఇప్పటికే కరోనా బారిన పడి 560 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరణించారని, పరీక్షలు పెట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు.వాస్తవాలు తెలసుకుని ఇప్పటికైనా పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని లోకేష్ కోరారు.విద్యార్ధులు,వారి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి టీడీపీ అండగా నిలుస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. పరీక్షలు రద్దుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.
సీబీఎస్ఈ కూడా రద్దు చేసింది
సీబీఎస్ఈ కూడా పరీక్షలు రద్దు చేసిందని,విద్యార్ధులు కూడా తరువాత తరగతులకు వెళ్లిపోయారని నారా లోకేష్ గుర్తు చేశారు. సమీక్షించి పరీక్షలు పెడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడాన్ని లోకేష్ తప్పుపట్టారు.అక్టోబర్‌లో పరీక్షలు పెడితే ఈ ఏడాది విద్యా సంవత్సరం కూడా దెబ్బతినిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల విద్యార్ధులు మానసిన ఆందోళనకు గురవుతున్నారని లోకేష్ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలు రద్దు చేశాయన్నారు.అస్సాం, కేరళ రాష్ట్రాలు కూడా ఈ వారంలో పరీక్షల రద్దుపై నిర్ణయం వెలువరించే అవకాశం ఉందన్నారు.కరోనా థర్డ్ వేవ్‌లో పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Must Read ;- జగన్‌రెడ్డికి పరీక్షలపై సమీక్షించే సమయమే లేదా : నారా లోకేష్











