కొవిడ్ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని,కొవిడ్ విషయంలో అన్నివిధాలుగా ముందస్తు జాగ్రత్తలు అవసరమని తెలంగాణ ఐటీ,పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) వ్యాఖ్యానించారు. అదే సమయంలో థర్డ్ వేవ్ విషయంపై ప్రస్తావిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.థర్డ్ వేవ్‌పై వార్తలు,అంచనాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అప్రమత్తత అవసరమని,పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లల వైద్యులకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేశారు.గతంలో స్పానిష్ ఫ్లూని గమనిస్తే మూడు దశల్లో వచ్చిందని గుర్తు చేశారు.థర్డ్ వేవ్ రాకూడదని కోరుకుందామని వ్యాఖ్యానించారు.వేములవాడలో రూ.22 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం,మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు.కోటి డోసుల వ్యాక్సిన్ కోసం టెండర్లు పిలిచినందున ఈ యేడాది చివరిలోగా అర్హులైన వారందరికి వ్యాక్సిన్లు వేయం సాధ్యం అవుతుందన్నారు.ప్రస్తుతం కొవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోందని,మళ్లీ వైరస్ తీవ్రత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేనని వ్యాఖ్యానించారు.
వ్యాక్సిన్ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నా..
ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నా మనకు అందుబాటులో లేకుండాపోయాయని, ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో కేంద్రం 85 శాతం తన ఆధీనంలో ఉన్నాయని,మిగిలిన 15శాతంలోనే రాష్ట్రాలు, ప్రైవేటు నిర్వాహకులు కొనుగోలు చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సిరిసిల్ల,వేములవాడ నియోజకవర్గాల్లో వైద్య సౌకర్యాలపై మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.అందులో భాగంగా థర్డ్ వేవ్‌పై ప్రస్తావించారు.పిల్లల కోసం జూన్ నెలలోగా సాధ్యమైనంత వేగంగా ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలన్నారు.పెద్దవాళ్లకు కొవిడ్ వస్తే పెద్దవాళ్లు ఆ లక్షణాలను గమనించుకుంటారని,నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో గమనించలేరని,పిల్లలు కూడా చెప్పలేరని వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదే సమయంలో కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్లాస్మా థెరపీ,రెమ్ డెసివేర్ కూడా వద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని,అలాంటి వాటిని వెంటనే అమల్లోకి తేవాలన్నారు.విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన వారి సేవలూ తీసుకోవాలని సూచించారు.ఎంత పనిచేసినా విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకోవద్దని,ఇప్పటికే వైద్యులు,సిబ్బందిపై భారం ఎక్కువగా పడుతోందని వ్యాఖ్యానించారు.సిరిసిల్లలో 50, వేములవాడలో 50 ఐసొలేషన్ సెంటర్లను ప్రత్యేకంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేయాలని సూచించారు.కాగా కొవిడ్ తగ్గినంత మాత్రాన అజాగ్రత్త పనికి రాదని,అప్రమత్తత,వ్యాక్సిన్లు మాత్రమే ఇందుకు పరిష్కారమన్నారు.ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిందని,అయితే కొవిడ్‌కు ఎలాంటి చికిత్స అవసరమనే అంశంపై ఫస్ట్ వేవ్‌తో పోల్చితే సెకండ్ వేవ్‌లో కొంత స్పష్టత వచ్చిందని వ్యాఖ్యానించారు.కొవిడ్ లక్షణాలను ముందుగా గుర్తించే చాలా వరకు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చని వ్యాఖ్యానించారు.
Must Read ;- ఉత్తర్వులు సరే.. వ్యాక్సిన్ లభ్యతపైనే సందేహాలు











