కాలంలో ప్రయాణించి.. గతాన్ని సరిచేసుకోవడం.. మంచి భవిష్యత్తును సెట్ చేసుకోవడం లాంటి కాన్సెప్ట్స్ తో హాలీవుడ్ మేకర్స్ తరచుగా సినిమాలు చేసేస్తూ ఉంటారు. అయితే అలాంటి కాన్సెప్ట్ లు మన భారతీయ తెరమీద చాలా తక్కువగా తెరకెక్కాయి. అప్పుడెప్పుడో సింగీతం శ్రీనివాసరావు బాలయ్యతో ‘ఆదిత్య 369’ తీశారు. మళ్ళీ మొన్నా మధ్య విక్రమ్ కుమార్ సూర్యతో ‘24’ తీశాడు. అయితే ఇంకా గతంలో ‘ఫన్ టు ష్…, లవ్ స్టోరీ 2050, యాక్షన్ రీప్లే’ సినిమాలు హీందీలోనూ, ఇండ్రు నేట్రు నాలై అనే సినిమా తమిళంలోనూ తెరకెక్కి మంచి విజయం సాధించాయి.
ఇక ఇప్పుడు మళ్లీ టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఒక తెలుగు సినిమా వస్తోంది.
అది అలాంటిలాంటి సినిమాకాదు. ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్ వారు. ప్రభాస్ , దీపికా పదుకొణే జంటగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. నిజానికి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడనగానే.. ఇది కూడా సాహో స్థాయిలోని యాక్షన్ మూవీ అయుంటుందని అనుకున్నారు అభిమాన ప్రేక్షకులు. అయితే ఇది సోషియో ఫాంటసీ సినిమా అని ఆ తర్వాత అర్ధమైంది. దాంతో ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి తరహా సోషియో మైథలాజికలో లేక సోషియో ఫోక్ లోరో అయి ఉంటుందని కూడా ఎక్స్ పెక్ట్ చేశారు .
కానీ ఇప్పుడు ఇది టైమ్ మెషీన్ కాన్సెప్ట్ అని తెలియడంతో.. అంచనాలు మరింతగా పెరిగాయి. దీనికి తోడు ఈ ప్రాజెక్ట్ కి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు హస్తవాసి కూడా యాడ్ కానుందని తెలియడంతో.. అందరికీ ‘ఆదిత్య 369’ సినిమానే మదిలో మెదులుతోంది. నైంటీస్ లోనే సింగీతం టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆ సినిమాతో గతంలోకి, భవిష్యత్తులోకి తీసుకెళ్ళి మంచి అనుభూతినిచ్చారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం నాగ్ అశ్విన్ .. సింగీతం లాంటి దిగ్దర్శకుడు ఇచ్చే విలువైన ఇన్ పుట్స్ ను తీసుకుంటున్నాడని తెలుస్తోంది. నిజానికి సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణతోనే ‘ఆదిత్య 369’ సినిమాకి సీక్వెల్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు.
దానికి ఆదిత్య 999 అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో గానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడిలా నాగ్ అశ్విన్ రూపంలొ అయినా.. మరోసారి టైమ్ మెషీన్ కాన్సెప్ట్ రానుండడం.. అందులో సింగీతం హ్యాండుండడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ సినిమా నికోలస్ కేజ్ నటించిన ‘నెక్స్ట్’ మూవీని పోలిన ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అందులో హీరో నికోలస్ కేజ్ కు.. కొద్ది నిమిషాల పాటు జరగబోయేది తెలిసిపోతుంటుంది . అతడికున్న ఈ టాలెంట్ తో తీవ్రవాదుల్ని పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది ఎఫ్ .బి.ఐ. కాన్సెప్ట్ ఖచ్చితంగా ఇదే కాకపోయినా.. స్టోరీ లైన్ మాత్రం ఈ తరహాలోనే ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా నిజంగా టైమ్ మెషిన్ కాన్సెప్ట్ అవునో కాదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.











