అమరావతి రాజధాని రైతుల ఉద్యమానికి మద్దతుగా గుంటూరులో ఇవాళ మహాపాదయాత్ర నిర్వహించారు. వేలాది మంది మహిళలు, రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ నెల 17 తేదీనాటికి రాజధాని ఉద్యమం ప్రారంభించి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలోపెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని రైతులు సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో నిర్వహించిన మహాపాదయాత్ర సక్సెస్ కావడంతో, ఈనెల 15న విజయవాడలో తలపెట్టిన పాదయాత్రను కూడా విజయవంతం చేయాలని అమరావతి జేఏసీ పట్టుదలగా ఉంది.
అమరావతిని సాధించుకునేంత వరకు ఉద్యమం ఆగదు
మూడు రాజధానుల ప్రకటన విరమించుకుని అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ తమ ఉద్యమం ఆగదని అమరావతి రైతులు స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన మహాపాదయాత్రకు జిల్లాలోని నలుమూలల నుంచి వేలాది మంది రైతులు హాజరయ్యారు. రాజధాని ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించేందుకు పలు పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. రాబోయే నెల రోజుల్లో కరోనా టీకా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో, ఇక అమరావతి ఉద్యమానికి అడ్డంకులు సృష్టించడం ఎవరి తరం కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. అమరావతి ఉద్యమాన్ని ఢిల్లీ తరహాలో పెద్ద ఎత్తున చేయాలని అమరావతి జేఏసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
రెచ్చగొట్టి, రాళ్లురువ్వి, తిరిగి కేసులు పెడతారా?
అమరావతి రాజధాని రైతులపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. ఉద్ధండరాయునిపాలెంలో తమను కులం పేరుతో దూషించారంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్న వెంకట్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై ఆగమేఘాలపై స్పందించిన పోలీసు అధికారులు 20 మంది రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఆరోతేదీ మధ్నాహ్నం కొందరు తమ ఇంట్లో నిద్రిస్తున్న ఎంపీ నందిగం సురేష్ ను తమను దూషిస్తూ దాడికి యత్నించారని నందిగం వెంకట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Must Read ;- మొగుణ్ని కొట్టి మొగసాల కెక్కినట్టు.. అమరావతి రైతులపై అట్రాసిటీ కేసులు
రైతులపై దాడి చేసి వారిపై అక్రమ కేసులా
అమరావతి రాజధానిలోని ఉద్దండరాయునిపాలెంలో ఈ నెల ఆరున ఉద్యమం చేస్తున్న కొందరు రైతులు, మహిళలపై రాళ్లదాడి జరిగింది. అక్కడికి సమీపంలో మూడు రాజధానులు కావాలంటూ కొందరు శిబిరం నిర్వహిస్తున్నారు. ఆ శిబిరంలోని వారే తమపై దాడికి పాల్పడ్డారని మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు. గుర్తుతెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో కొందరు మహిళలు గాయపడ్డారు.
దీంతో కోపోద్రిక్తులైన రైతులు, మహిళలు రోడ్డుపైనే భైఠాయించారు. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు రోడ్డు ఖాళీ చేసి శిబిరంలోకి వెళ్లాలని హుకుం జారీ చేశారు. అయినా రాళ్ల దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తేనే ధర్నా విరమిస్తామని మహిళలు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక పోలీసులు అదనపు బలగాలను దింపారు. మహిళలకు అండగా మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ నేత శ్రావణ్ కుమార్ రంగంలోకి దిగారు. పోలీసులతో చర్చలు జరిపారు. రాళ్లదాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించడంతో మహిళల రోడ్డును ఖాళీ చేసి శిబిరంలోకి తరలివెళ్లారు.
పోలీసుల వింత కేసు
రాళ్లు రువ్వారంటూ 20 మంది రైతులపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వీరిలో 16వ నిందితురాలుగా పేర్కొంటూ మూడేళ్ల కిందటే చనిపోయిన హైమావతిపై కూడా కేసు నమోదు చేశారు. చనిపోయిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టడంపై పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఉద్దండరాయునిపాలెం రైతులపై రాళ్లు రువ్వడమే కాకుండా, వారిపైనే తప్పుడు కేసులు పెట్టడంపై గుంటూరు మహాపాదయాత్రలో రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నినదించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ రైతులు మహాపాదయాత్రలో వేలాదిగా పాల్గొన్నారు.
Also Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!