రవితేజ దుమ్మురేపేస్తున్నాడు .. వసూళ్ల పరంగా కుమ్మేస్తున్నాడు. సరైన కథ .. పవర్ఫుల్ పాత్ర పడాలేగానీ, తనని ఆపడం చాలా కష్టమనే విషయాన్ని మరోసారి నిరూపించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ వరుస ఫ్లాపులతో ఉన్న కారణంగా, ఈ సినిమాపై అంతగా అంచనాలు ఉండేవికావు. సంక్రాంతికి కాస్త ముందుగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి నాటికి సర్దుకుంటుందని అంతా అనుకున్నారు. సంక్రాంతికి యంగ్ హీరోల సినిమాలు లైన్లో ఉండటం వలన అలా భావించారు.
కానీ ఈ సినిమా విషయంలో చాలామంది అంచనాలు తలక్రిందులు అయ్యాయి. సంక్రాతికి కాస్త ముందుగా బరిలోకి దిగిన రవితేజ, ఇంకా తన జోరు చూపుతూనే ఉన్నాడు. కోడి పందాలు .. ఎడ్ల పందాల జోరు తగ్గిందేగానీ ‘క్రాక్’ జోరు మాత్రం తగ్గలేదు. సంక్రాంతికి వచ్చిన యంగ్ హీరోల సినిమాల సందడి తగ్గిందేగానీ, రవితేజ దూకుడు మాత్రం కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా సాలిడ్ హిట్ అనడానికి ఇప్పుడు మరో నిదర్శనం కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా థియేటర్స్ సంఖ్యను పెంచుతున్నారు.
ఆయా ప్రాంతాల్లో థియేటర్లను పెంచడం వలన, ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ హీరోల్లో రవితేజ హవా తగ్గిందని అనుకున్నవారు తమ అభిప్రాయం మార్చుకునేలా ఈ సినిమా చేసింది. ఇక దర్శకుడిగా గోపీచంద్ మలినేని సత్తాను కూడా ఈ సినిమా చాటిచెప్పింది. ఇతర స్టార్ హీరోల నుంచి కూడా ఆయనకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ కి కూడా ఈ హిట్ కలిసొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే వచ్చే సంక్రాంతికి కూడా గుర్తుండిపోయేలా ‘క్రాక్’ తన స్టాంప్ వేసేసింది.