కొంత కాలంగా అల్లరి నరేష్.. సినిమాలు విజయం సాధించకపోయినా, మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమా ద్వారా అల్లరి నరేష్ మరల హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. నరేష్ తాజాగా నటించిన సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తుండగా సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శిలు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో కొంత విరామం తీసుకోని నరేష్ ఈ సినిమాలో నటించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలతోనే సినిమాపై ఆసక్తిని నెలకొల్పారు దర్శకనిర్మాతలు.
ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నరేష్. అయితే ఈ మధ్య కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీ నుండి థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా థియేటర్ల యజమానులు ముందుకు రావడంలేదు. తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. పెద్ద సినిమాలలో నాని నటించిన ‘వి’, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ లాంటి సినిమాలు విడుదలకాగా మరికొన్ని సినిమాలు ఇదేబాటలో ప్రయాణించడానికి చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ నటించిన ‘నాంది’ సినిమా కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ అవ్వబోతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పనులన్నీ పూర్తికావడంతో ఓటీటీ విడుదలకే వెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు ఫిలింనగర్ సమాచారం. సినిమాకు ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్ వస్తే రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఓటీటీ ద్వారా అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించడానికి వస్తాడన్నమాట.