సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప‘ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగానికి సంబంధించిన షూటింగు దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమాను ‘క్రిస్మస్’కు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కథాకథనాలు .. బన్నీ ఫైట్లు .. డాన్సులతో పాటు, దేవిశ్రీప్రసాద్ పాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.
సుకుమార్ .. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చే సినిమాల్లో మాస్ ను హుషారెత్తించే ఐటమ్ ఒకటి తప్పకుండా ఉంటుంది.అలాగే ఈ సినిమా కోసం కూడా దేవిశ్రీ ప్రసాద్ దుమ్మురేపేసే రెండు స్పెషల్ సాంగ్స్ ను రెడీ చేశాడట. ముందుగా ఈ సినిమాను ఒక భాగంగానే విడుదల చేయాలనుకున్నప్పుడు ఒక ఐటమ్ ను సిద్ధం చేశాడట. ఆ తరువాత రెండు భాగాలుగా చేయాలనుకున్నప్పుడు రెండో ఐటమ్ ను కూడా రెడీ చేయడం జరిగిందని చెబుతున్నారు.
ఇక ఈ ఐటమ్ సాంగ్స్ కోసం ఊర్వశీ రౌతేలను .. సన్నీలియోన్ ను ఎంపికపై చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఏ భాగంలో ఎవరు జోరు చూపిస్తారనేది మాత్రం తెలియదు. ఒక్క ఐటమ్ సాంగ్ కోసం సన్నీలియోన్ 70 లక్షలు తీసుకోనుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఫస్టు పార్టులో ‘బోట్’ ఫైట్ హైలైట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. భారీ వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించేస్తుందేమో చూడాలి.