Tcongress Will Invite RS Praveen Kumar :
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుస నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ అధికార పార్టీకి సవాల్ విసురుతోంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరల ధరలపై పోరాటాలు చేస్తూ ప్రజా బలాన్ని కూడగట్టుకుంటోంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. మరోవైపు పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా ముందుకుసాగుతోంది. ‘కాంగ్రెస్ ఘర్ వాపసీ’ పేరుతో పార్టీ వీడిన నాయకులతో జోరుగా చర్చలు జరుపుతూ కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్, డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడుతో చర్చలు జరిపిన కాంగ్రెస్ నేతలు మాజీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో సైతం చర్చలు జరిపిన ఆశ్చర్యపోనకర్లేదు.
ఆర్ఎస్ కు ఆహ్వానం
పార్టీ బలోపేతంలో భాగంగా టీకాంగ్రెస్ తెలంగాణ ఉద్యమకారులు, దళిత నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్న నాయకులను, ప్రజాప్రతినిధులను మంతనాలు జరుపుతూ.. పార్టీ చేర్చుందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆయన టీజేఎఫ్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేదీ లేదని, అవసరమైతే ప్రజల పక్షాన మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్చంధ పదవీ విరమణ చేయడం.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమతో కలిసి పనిచేయడానికి ఇష్టం చూపితే.. కచ్చితంగా ఆహ్వానిస్తామని కాంగ్రెస్ నేత మధుయాష్కీ చెప్పడం విశేషం. ఉద్యమకారులు కోదండరాం, చెరుకు సుధాకర్, విమలక్కలతో చర్చలు జరిపామని మధుయాష్కీ స్పష్టం చేశారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితుల కోసం బహుజన పార్టీ ఏదైనా పెడతారా? లేదా ఇతర పార్టీలో చేరుతారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ దళిత దండోర
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితుల పాట పాడుతుండటంతో.. టీకాంగ్రెస్ కూడా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. దళితబంధు ద్వారా కేసీఆర్ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెప్పేందుకు ‘దళిత దండోర’కు శ్రీకారం చుట్టింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చే నెల 9వ తేదీ నుంచి దళిత, గిరిజన దండోరా కార్యక్రమం ప్రారంభం అవుతుందని, సెప్టెంబర్ 17 వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని మధుయాష్కీ వివరించారు. తర్వాత అన్ని నియోజక వర్గాల్లో కూడా చేస్తామన్నారు. వరదలతో ఇండ్లు కొట్టుకుపోయాయని, వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కాబట్టి సర్కార్ ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.