ఎవరో జ్వాలను రగిలించారు..
అమరావతి రాజధాని జనభేరికి జనం పోటెత్తారు. అడుగడుగునా పోలీసులు అడ్డుపడుతున్నా జనం వెనక్కు తగ్గలేదు. పలు పార్టీల నేతలను ముందుగా గృహ నిర్బంధం చేశారు. ఒకానొక సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని కూడా జనభేరికి హాజరుకాకుండా అడ్డుకోవాలని పోలీసులు యత్నించారు. గంటసేపు చంద్రబాబు కాన్వాయ్ ను రోడ్డుపైనే నిలిపివేశారు. చివరకు అనుమతించారు. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అమరావతి జేఏసీ నేతలు, పలు పార్టీల ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు జనభేరికి హాజరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని నినదించారు.
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్
అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని విజయవాడలో జరిగిన బీసీల సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే 19 నెలలుగా ఏం పీకుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యాపారి సీఎం అని చంద్రబాబు విమర్శించారు. అమరావతి ఉద్యమం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రైతులు స్వచ్ఛందంగా రాజధానికోసం 34 వేల ఎకరాల భూములిచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.
రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం చూస్తే కడుపుతరుక్కుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని చంపేసేందుకు కులం ముద్ర వేశారని చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్రమంతా తనవైపు ఉందంటున్న జగన్ రెడ్డి రెఫరెండం కు సిద్ధమా అని చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రజలంతా అమరావతిని రాజధానిగా వద్దనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. అమరావతి రాజధానికి బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని ఎవరూ అంగుళం కూడా కదిలించలేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. రాజధాని రైతులు ధైర్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న మహిళలను చంద్రబాబు కొనియాడారు.
అడుగడుగునా పోలీసుల అడ్డంకులు
జనభేరి సభకు హాజరయ్యే నాయకులు, ప్రజలను అడ్డుకునేందుకు అమరావతికి దారితీసే ప్రతిమార్గంలో వందలాది పోలీసులను మోహరించారు. బారికేడ్లు పెట్టి జనభేరి సభకు వచ్చే వారిని గంటల కొద్దీ అడ్డుకున్నారు. చివరకు టీడీపీ అధినేతను కూడా పోలీసులు గంటసేపు రోడ్డుపైనే నిలిపివేశారు. పెద్దఎత్తున జనం రావడంతో చివరకు వదిలేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కారును కూడా పోలీసులు గంటలకొద్దీ నిలిపివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడుగడునా ఈ ఆంక్షలు ఏమిటని అచ్చెన్నాయుడు పోలీసు అధికారులను ప్రశ్నించారు. చివరకు వామపక్షాల నేతలను కూడా వదల్లేదు. వారిని ఉదయం పది గంటల వరకూ గృహ నిర్బంధం చేశారు. తరువాత వదిలిపెట్టారు.
జనసముద్రంలా మారిన రాయపూడి
జనభేరి సభ నిర్వహించిన రాయపూడి గ్రామం జన సముద్రంలా మారింది. అమరావతి ఉద్యమాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, రైతు సంఘాల నేత శివారెడ్డి, దళిత సంఘాల నేత కోటయ్యతోపాటు వందలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు.
మూడు రాజధానుల నిర్ణయం పిచ్చి తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్ చెపుతున్నది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వినాశనం అని ఆయన విమర్శించారు. మూర్ఖుడు తప్ప కల్పవృక్షంలాంటి అమరావతిని ఎవరూ వదులుకోరని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అమరావతిని మూడు ముక్కలు చేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని, గాంధేయ మార్గంలో అడ్డుకుంటామని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ స్పష్టం చేశారు. చేసిన తప్పును సరిచేసుకుని ఇప్పటికైనా ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
కావాలనే అచ్చెన్నాయుడిని పోలీసులు వదిలారు
ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడితే.. విశాఖకు రాజధాని రావడం అచ్చెన్నాయుడికి ఇష్టం లేదని ప్రచారం చేయాలనే లక్ష్యంతోనే ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేయకుండా విడిచిపెట్టారని తెలుస్తోంది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని, ఎవరూ అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని అచ్చెన్నాయుడు జనభేరిలో స్పష్టం చేశారు. రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసులు పెట్టిన తుగ్లక్ పాలన ఏపీలో కొనసాగుతోందని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జనభేరి సభ విజయవంతం కావడంతో కాబోయే కొద్ది రోజుల్లో అమరావతి ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు తీసుకెళ్లాలని పలు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.